ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఒక వారం గ్యాప్ తీసుకుని… “హిలేరియస్ టాపిక్”తో కొత్తపలుకులు వినిపించారు. అన్న జగన్మోహన్ రెడ్డితో తీవ్రంగా విబేధిస్తున్న షర్మిల కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఇంత వరకూ ఆసక్తిగానే ఉంటుంది. కానీ.. ఆమె పార్టీ పెట్టాలనుకంటోంది ఏపీలో కాదు.. తెలంగాణలో…! ఆర్కే చెప్పిన ఈ అంశమే ఇప్పుడు హైలెట్ అవుతోంది. అన్నతో గొడవుల పడితే.. తనకు ఎంపీ పదవో… మరొకటో ఇవ్వకపోతే.. ఏపీలోనే సొంత పార్టీ పెట్టుకుంటారు కానీ..తెలంగాణకు ఎందుకెళ్తారు..?అన్నది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న.
తెలుగు రాష్ట్రాలు అని చెప్పుకోవడమే కానీ.. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య చాలా అంటే చాలా స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోంది. అక్కడ పార్టీలేవీ తెలంగాణలో ప్రభావం చూపడం లేదు. అక్కడి నేతలపైనా తెలంగాణ వారు ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు.. కొత్తగా ఏపీ నుంచి వచ్చి తెలంగాణ కోసం పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎవరైనా చేస్తారా..?. కనీసం.. సన్నిహితులతో చేసే అభిప్రాయసేకరణలో అయినా…. ఇది పిచ్చి నిర్ణయమన్న ఫీడ్ బ్యాక్ రాదా..?. ఆర్కేకి అయినా ఇదేదో తేడాగా ఉందే అన్న ఆలోచన ఎందుకు రాలేదో మరి..! తనకు అందిన సమాచారం ప్రకారం.. ఆయన రాసేశారు. తన మీడియాలో విశేషమైన ప్రచారం కూడా కల్పిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డితో షర్మిల విబేధాల గురించి కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. క్రిస్మస్తో పాటు మరికొన్ని ముఖ్యమైన వేడుకలకు ఆమె పులివెందులకు వెళ్లి కుటుంబసభ్యులతో కలసి పాల్గొనలేదు. గతంలో సాక్షి పత్రికలో ఆమె పాదయాత్రపై పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ఫీచర్స్ ఎడిటర్ రామ్ చేసిన స్టోరీలన్నింటినీ భారతి నిలిపివేయించారు. అప్పట్నుంచి విబేధాలున్నాయని చెప్పుకుంటున్నారు. అవి కొంత వరకూ ఉండవచ్చు. అంత మాత్రాన.. తెలంగాణలో పార్టీ పెట్టేస్తారని చెప్పుకోవడం కాస్త అసహజంగా ఉంటుంది. షర్మిలకు అన్నపై కోపం ఉంటే.. తానే వైఎస్‌కు నిజమైన వారసురాలినని అనుకుంటే… రాజన్న రాజ్యం తేలేదని జగనన్నపై కోపం ఉంటే… ఏపీలోనే ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసే చాన్స్ ఉంది.
ఆర్కేకు విశ్వసనీయ సమాచారం అందిందో.. లేకపోతే.. అలా అందేలా జగన్ క్యాంప్ లేదా.. షర్మిల క్యాంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ప్రకారం.. ఒక్కో సారి నెగెటివ్ మీడియాలో నెగెటివ్ కథనాలు వచ్చినా.. తమకు మంచే అనుకుంటూ ఉంటారు. అలాంటివి చేస్తూ ఉంటారు. ఎన్నికల సమయంలో విజయసాయిరెడ్డిలీక్ చేసిన కొన్ని ఆడియో టేపులే ఇందుకు సాక్ష్యమని కొంత మంది చెబుతూ ఉంటారు.
ఆర్కే కొద్ది రోజుల కిందట… తెలంగాణలో మళ్లీ వైసీపీకి పురుడు పోస్తున్నారని.. దానికి కేసీఆర్ అండ ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు షర్మిల పార్టీ తెరపైకి వచ్చింది. దాన్ని.. దీన్ని రెండింటిని కంపేర్ చేస్తే… జగనన్నతో షర్మిల గొడవలు కాదు కానీ.. జగన్‌తో కలిసి కేసీఆర్… బీజేపీని ఎదుర్కొనేందుకు సరికొత్త ప్లాన్ ను అమలు చేస్తున్నారని అనుకోవచ్చంటున్నారు. బీజేపీతో జగన్ కు ఇబ్బంది లేకుండా.. తన మాట వినకుండా చెల్లి పార్టీ పెట్టేసుకుందని నమ్మించవచ్చు.. మిత్రుడు కేసీఆర్ కు కావాల్సినంత రాజకీయ సాయం చేయవచ్చన్న వ్యూహం కూడా అందులో ఉందంటున్నారు. మొత్తానికి ఆర్కే పలుకు ఈ సారి కాస్త హైలెట్ అవడం ఖాయం. అది కామెడీనా.. సీరియస్సా అనేది… కాస్త లేటుగా తేలుతుంది.