వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అక్టోబర్ 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పాదయాత్రకు ప్రజాప్రస్థానం అని పేరు పెట్టారు. వైఎస్ పాదయాత్రను ప్రారంభించిన చేవెళ్ల నుంచే షర్మిల కూడా ప్రారంభిస్తారు. అలాగే ముగింపు కూడా చేవెళ్లలోనే ఉంటుంది. 90 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగుతుందని షర్మిల తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ పాలన అందిస్తామన్న నమ్మకాన్ని పాదయాత్ర ద్వారా ప్రజలకు కల్పిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. అలాగే ఇప్పుడు చేస్తున్నమంగళవారం దీక్షలు కూడా చేయాలని నిర్ణయించారు.
షర్మిల పార్టీకి నిర్మాణం లేదు. పార్టీలో చేరేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. ఉన్న నేతలు ఒక్కొక్కరు మొహం చాటేస్తున్నారు. ఇలాంటి సమయంలో షర్మిల ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పాదయాత్ర చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. జాతీయ పార్టీలే ఖర్చులో పోటీ పడలేని పరిస్థితి ఉంటుంది. అయినా షర్మిల మాత్రం ధైర్యంగాఅడుగు ముందుకేస్తున్నారు. ఆమె పాదయాత్రకు జనం వెళ్లకుండా కట్టడి చేయడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. అందులో సందేహం లేదు. ఈ కారణంగా ఆమె పాదయాత్ర వెలవెలబోతే అది పార్టీ ఇమేజ్‌పై ప్రభావం చూపుతుంది.
ఇప్పటికే రాజకీయాల్లో పాదయాత్రలు రొటీన్ అయిపోయాయి. తెలంగాణలో బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. వైఎస్ఆర్ అభిమానులే తన బలం అనుకుంటున్న షర్మిల తనది ప్రత్యేకమైన పాదయాత్రగా భావిస్తున్నారు. ఈ పాదయాత్రనే ఆమె పార్టీ పరిస్థితిని డిసైడ్ చేసే అవకాశం ఉంది.