వైఎస్ చనిపోయాక.. సొంత రాజకీయాల కోసం సోనియా గాంధీనే కుట్ర చేసి చంపించారని.. జగన్, షర్మిల, విజయమ్మ రోడ్లపై డ్రామాలేసిన సీన్లు చాలా మంది మర్చిపోయి ఉంటారు. వైఎస్ అసలు కాంగ్రెస్ లీడర్ కాదని.. ఆయన పుట్టుకతోనే వైసీపీ లీడర్ అన్నట్లుగా కలరింగ్ ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వైఎస్ పిల్లల్లో ఒకరికి కాంగ్రెస్ అండ కావాల్సి వస్తోంది. అందుకే గతంలో తాము ఆ అధినాయత్వాన్ని ఎన్నెన్ని మాటలన్నామో మర్చిపోయి.. పొగడ్తలు కురిపించేస్తున్నారు.
వైఎస్ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఆయనకు నివాళులు అర్పిస్తూ.. ఓ ట్వీట్ చేశారు.దీనికి షర్మిల ఇచ్చిన రిప్లై .. ఆమె కాంగ్రెస్ లో కలిసిపోవడానికి ఎంత ఆతృతగా ఉన్నారో అద్దం పట్టేలా ఉంది. రాహుల్ గాంధీ మనసులో ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నందుకు వైఎస్ షర్మిల పట్టరానంత సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే దేశం ఉన్నతంగా పురోగమిస్తుందని వైఎస్ నమ్మకమని పేర్కొన్నారు. ఈ ట్వీట్లో షర్మిల వైఎస్ఆర్ కమిటెడ్ కాంగ్రెస్ లీడర్ అని ..ప్రజల కోసం చనిపోయారన్నారు.
వైఎస్ కుటుంబం కాంగ్రెస్ తో విబేధించి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఎప్పుడూ కాంగ్రెస్ నేతలను అభినందించిన దాఖలాలు లేవు.. దాదాపుగా ప్రతి ఏడాది కాంగ్రెస్ నాయకత్వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున ఆయనను గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. ఇలాంటి ప్రకటనలు చేయడం లేదు కానీ.. షర్మిల మాత్రం సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలనుకుంటున్నారు. ఆమెను ఏపీ రాజకయాల్లోకి తీసుకు రావాలన్నది హైకమాండ్ లక్ష్యం . షర్మిల అందుకు సిద్ధమవుతున్నట్లుగానే కనిపిస్తోంది.