వైఎస్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్కు షర్మిల మద్దతు ప్రకటించారని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు. తాను పార్టీ పెట్టినప్పుడు షర్మిలతో సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారని.. మరి ఇప్పుడు ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. ఏపీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆరే సభల్లో చెబుతున్నారు… ముందు అక్కడి నేతలు దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఏపీ పరిస్థితిపై అక్కడి నేతలు ఆలోచిస్తే మంచిదని పరోక్షంగా జగన్ రెడ్డికి కూడా వైఎస్ షర్మిల సలహా ఇచ్చారు.
షర్మిల పోటీ నుంచి విరమించుకుని… కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ వాళ్లు మద్దతు కావాలని అడగలేదు. దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన షర్మిల.. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేద్దామనుకున్నా కొంత మంది అడ్డుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆయనే అడ్డుకున్నారనే అర్థంలో మండిపడ్డారు. అయితే షర్మిల మద్దతు విషయంపై కాంగ్రెస్ నేతలు ఎవరూ కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పడం లేదు. ఆమె మద్దతు వల్ల మంచి కన్నా కీడే ఎక్కువ జరుగుతుందని అనుకుంటున్నారు. అందుకే సైలెంట్ గా ఉంటున్నారు.
కానీ షర్మిల వెంటపడి మరీ కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నారు. కానీ అందులో ఉన్న ఒకరిద్దరు నేతలపై విమర్సలు గుప్పిస్తున్నారు. షర్మిల తీరు చూస్తూంటే.. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతగా మారిపోవాలని అుకుంటున్నారని.. చెబుతున్నారు. కానీ ఆమె పార్టీలో చేరినా తెలంగాణలో రాజకీయాలు మాత్రం వద్దని.. ఇప్పటికే.. టీ కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు తేల్చి చెప్పేశారు.