వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో ఆయనకు తానే రాజకీయ వారసురాలినని షర్మిల నేరుగా సందేశం ఇచ్చారు. ఇవ్వాళ YSR వారసుడు అని చెప్పుకొనే వాళ్ళు BJP అంట కాగుతున్నారని.. తెర వెనుక పొత్తులు పెట్టుకొని YSR ఆశయాలను తుంగలో తొక్కారని .. అలాంటి వారు YSR వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. వారు వైఎస్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించారు. వారంతా వైఎస్ రాజకీయ ఆశయాలను నిలబెట్టిన వారు ఎలా అవుతారో ఓ సారి ఆలోచన చేసుకోవాలని సలహా ఇచ్చారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమని షర్మిల స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇంకా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాక ముందే ఆయన ప్రధాని కావాలని మొదట చెప్పిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మర్చిపోయి .. వారికి దూరమయ్యే వారు ఇప్పుడు ఉన్నారని.. కానీ రెండో సారి గెలిచిన తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డి మాత్రం ప్రతి పథకం ప్రజలకు అందాలన్న లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచన చేశారన్నారు.
షర్మిల ప్రసంగం పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా సాగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తానే అసలైన రాజకీయ వారసురాలినని .. వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ నేత మాత్రమేనని గుర్తు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. జగన్ బీజేపీతో అంట కాగుతున్నారని చెప్పడం ద్వారా షర్మిల ప్లాన్ ప్రకారం వైఎస్ అభిమాన ఓటు బ్యాంక్ ను జగన్ కు దూరం చేసేలా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.