తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల పాదయాత్రకు మరోసారి బ్రేక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు కొనసాగించి.. వచ్చే నెల మొత్తం విరామం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆమె వ్యక్తిగత పనుల కోసం అమెరికాకు వెళ్లనున్నారని వైఎస్ఆర్టీపీ వర్గాలు చెబుతున్నాయి. తిరిగి వచ్చిన తర్వాత పాదయాత్ర కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు.
చేవెళ్ల నుంచి యాత్రను ప్రారంభించిన షర్మిల.. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. ఇప్పటి వరకు షర్మిల 791 కిలో మీటర్ల దూరం నడిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఒకసారి యాత్రను వాయిదా వేశారు. కొవిడ్కారణంగా చాలా రోజులు ప్రజా ప్రస్థాన యాత్రకు బ్రేకులు పడ్డాయి. కాగా ఇప్పుడు మరోసారి యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు.
షర్మిల పాదయాత్ర అనుకున్నంతగా పార్టీకి ఊపు తీసుకు రాలేకపోతోంది. ఎక్కడా వైఎస్ఆర్టీపీ కి క్యాడర్ లేకపోవడంతో ఒకే కార్యకర్తలు వెంట నడవాల్సి వస్తోంది. మీడియాలోనూ అనుకున్నంత బజ్ రావడం లేదు. ఇతర పార్టీలు.. వైఎస్ఆర్టీపీని ఓ పార్టీగా పరిగణించే పరిస్థితి లేకుండా పోయింది. అయినా షర్మిల మొండిపట్టుదలగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అమెరికా పర్యటన తర్వాత ఆమె కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.