వైఎస్ కుటుంబం మొత్తం రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్నే కాదు ఆయన మరణాన్ని కూడా జనం నమ్మినంత కాలం ఉపయోగించుకునేందుకు ఏ మాత్రం సిగ్గుపడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గతంలో విజయమ్మ, జగన్, షర్మిల ఏపీ పర్యటనలో అలాంటి ఆరోపణలు చేసేవారు. వారు రిలయన్స్ పై ఆరోపణలు చేశారు. ఆ రిలయన్స్‌కే ఇప్పుడు జగన్ రాజ్యసభ సీటిచ్చారు. తన ఇంట్లో అంబానీకి విందు ఇచ్చారు. అందరూ ఔరా అనుకుంటున్న సమయంలోనే షర్మిల తెలంగాణ లో “వైఎస్ చావు పాట” ప్రారంభించారు.
తెలంగాణలో ఆమె పాదయాత్రను కనీసం పట్టించుకుంటున్న వారు లేరు. కేసీఆర్ ఉరేసుకుని చచ్చిపోవాలని అంటున్నా… ఇతర టీఆర్ఎస్ నేతల్ని దారుణంగా తిడుతున్నా పట్టించుకున్న వారులేరు. దీంతో ఆమె కొత్త పద్దతిలో మీడియా ముందుకు వచ్చారు. సంకెళ్లు తీసుకు వచ్చి మీడియా సమావేశంలో ప్రదర్శించి వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారని వైఎస్ షర్మిల అన్నారు. తనను కూడా అలాగే కుట్ర చేసి చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్ మరణం వెనుక ఉన్న కుట్ర ఆ కుటుంబానికి వారికి ప్రజల్లో సానుభూతి అవసరం అయినప్పుడు.. అధికారం లేనప్పుడే గుర్తుకు వస్తోంది. ఇతర సందర్భాల్లో మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు.
తనను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని ప్రెస్ మీట్లో సంకెళ్లు చూపిస్తూ ఆ సంకెళ్లు తనను ఏమీ చేయలేవని అన్నారు. తనకు బేడీలు అంటే భయం లేదని, చేతనైతే తనను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలు విసిరారు. తాను బతికి ఉన్నంత కాలం ప్రజల నుంచి తనను వేరు చేయడం ఎవరి తరమూ కాదని పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పారు. షర్మిల వ్యవహారశైలి చూస్తూంటే ప్రశాంత్ కిషోర్ ను కాపీకొట్టే స్ట్రాటజిస్ట్ ఎవరో షర్మిలకు పని చేస్తున్నారన్న అనుమానం తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.