కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య కేసును చర్చనీయాంశం చేశారు. అయితే కోర్టుకెళ్లి ఎవరూ మాట్లాడకుండా ఆర్డర్స్ తెచ్చుకున్నారు. కానీ ప్రజల్లో చర్చ మాత్రం ఆగే అవకాశం కనిపించడం లేదు. కడప నుంచి ప్రారంభించి షర్మిల కర్నూలులోనూ ప్రచారం చేశారు. షర్మిల సభలకు జనం ఉరకలెత్తకపోయినా కాంగ్రెస్ పార్టీకి కూడా ఆదరణ ఉంది అనిపించేలా వస్తున్నారు.
కడప, కర్నూలు జిల్లాల్లో షర్మిల చేసిన ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సునీత కూడా షర్మిలతో ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు తర్వాత కూడా రాయలసీమలోనే షర్మిల ఎక్కువగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కొన్ని కీలక నియోజకవర్గాలపై గురి పెట్టి.. ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ కు వచ్చే ప్రతి ఓటు వైసీపీదేనన్న అభిప్రాయం ఉంది. ముస్లిం, దళిత ఓటర్లు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంతో మహిళా ఓటర్లూ దూరమయ్యారు.
షర్మిల రాయలసీమలో సీట్లు గెలవలేకపోవచ్చు కానీ.. వైసీపీ ఓటమిని శాసిస్తే మాత్రం.. తర్వాత ఆమెదే రాజకీయ భవిష్యత్ అయ్యే అవకాశం ఉంది. షర్మిలనే ప్రజలు వారసురాలిగా గుర్తిస్తున్నరన్న అభిప్రాయం పెరుగుతుంది. వైసీపీ ఉనికి ప్రమాదంలో పడుతుంది.. మళ్లీ కాంగ్రెస్సే ముందుకు వస్తుంది.