తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న షర్మిల… తాను పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన రాజకీయ కార్యక్షేత్రంగా ఎంచుకున్నట్లుగా నేరుగానే చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలానో…తనకు ఖమ్మం జిల్లా పాలేరు అలాంటిదని ప్రకటించేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాను పాలేరు నుంచే రాజకీయ రంగంలోకి దిగుతానని .. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో మన ప్రభంజనాన్ని ఆపలేరని ఆత్మీయ సమావేశంలో భరోసా ఇచ్చారు. షర్మిల రాజకీయ పార్టీ ప్రకటనను ఖమ్మం జిల్లాలోనే చేయనున్నారు.
ఏప్రిల్ తొమ్మిదో తేదీన జరగనున్న బహిరంగసభలో భారీ జన సమీకరణ చేసి.. పార్టీ పేరును జెండాను ఆవిష్కరించనున్నారు. తాను కూడా ఖమ్మం జిల్లా నుంచే పోటీ చేయాలని ముందుగానే నిర్ణయించుకుని ఖమ్మం జిల్లా నుంచే ప్రస్థానం ప్రారంభిస్తానని తేల్చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. గతంలో రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరపున వరుసగా గెలుస్తూ వచ్చారు. ఆయన మరణం తర్వాత జరిగిన ఉపఎన్నికలో తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి.. మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలిచారు.
అయితే తర్వాత సాధారణ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన కందాళ ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ హవా వీచినా తుమ్మల గెలవలేకపోయారు. అలా… సామాజికవర్గ పరంగా స్ట్రాంగ్ ఓటు బేస్.. ఉన్న స్థానాన్ని వ్యూహాత్మకంగానే షర్మిల ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.