కొంగు చాచి అడుగుతున్నా ఆదరించండి అని షర్మిల అడుగుతున్న దృశ్యాలు .. కరుడుగట్టిన వ్యక్తినైనా కాసేపు ఆలోచింప చేసేలా ఉన్నాయి. పులివెందులలో ప్రచారం చేసిన షర్మిల, సునీత మహిళా సెంటిమెంట్ ను ప్రయోగిస్తున్నారు. తాను వైఎస్ఆర్ బిడ్డనని .. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అన్న జగన్ రెడ్డి రోడ్డున పడేశారని నేరుగా చెబుతున్నారు. ఆడిపిల్లలు అలా రోడ్డున పడి దీనంగా తమకు అండగా ఉండాలని వేడుకుంటూంటే.. ఓటర్లకు అయ్యో పాపం అనిపించక మానదు.
నిజానికి ఇలాంటి వేడుకోళ్లు జగన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో కనిపించాయి. అప్పట్లో ప్రజల దగ్గర ఇలాగే వైఎస్ కుటుంబం విజ్ఞప్తి చేసింది. వీధి వీధినా .. విజయమ్మ, ,షర్మిల దీనంగా ఉన్న పోస్టర్లు పెట్టారు. జగన్ రెడ్డి కటకటాల వెనుక ముత్తయిదువులా కూర్చున్న ఫ్లెక్సీలను ఊరూవాడా ఏర్పాటు చేశారు. ఆ సెంటిమెంట్ భారీగా వర్కవుట్ అయింది. ఇప్పుడు మోసం చేసిన అన్నపై అదే సెంటిమెంట్ ను.. బాధితులుగా షర్మిల, సునీత ప్రదర్శిస్తున్నారు. ఇది ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
వైఎస్ తో అనుబంధం పులివెందుల ప్రజలకు ఎక్కువ కాబట్టి.. ఓటర్లలో మార్పు అనేది వస్తే అక్కడే తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే జరిగితే.. మొదటికే మోసం వస్తుంది. వీరిని ఎదుర్కోవడానికే జగన్మోహన్ రెడ్డి భారతిని రంగంలోకి దించారు. ప్రచార బాధ్యతలను ఆమె తీసుకున్నారు. తీసుకున్న రోజే. షర్మిల, సునీత ప్రచారాన్ని అడ్డుకునేలా కొంత మంది రచ్చ చేశారు. అంటే.. వీరిద్దర్నీ ఎదుర్కొనే వ్యూహం చేతల్లోనే ఉంటుందా అన్న సందేహాలు ఉన్నాయి.
మొత్తంగా షర్మిల న్యాయం చేయాలన్న దీనమైన విజ్ఞప్తులతో ప్రజల్లోకి వెళ్తే… సెంటిమెంట్ పండుతుంది. దీనికి విరుగుడుగా భారతి వేసే ప్రణాళికలు కీలకం కానున్నాయి. లేకపోతే.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని నిరూపించేస్తారు షర్మిల, సునీత.