తన తండ్రి హంతకులకు శిక్ష వేయించేందుకు వైఎస్ సునీత చేస్తున్న ప్రయత్నాలు చివరికి తాను అప్రకటిత లాయర్ కావాల్సి వచ్చింది…అదీ కూడా సుప్రీంకోర్టులో. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తానే వాదనలు వినిపిస్తానంటూ సునీతారెడ్డి ముందుకు వచ్చారు.
దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ఎవరైనా సీనియర్ లాయర్ ను సాయం కోసం పెట్టుకోవాలని సూచించింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రాను సునీతకు సాయం చేయాలని కోరింది. సునీత స్వయంగా తన వాదనలు వినిపించారు. ఇతర లాయర్లు చేసినట్లుగానే తన వాదనలు వినిపించారు.
అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని.. సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సునీద ధర్మాసనానికి తెలిపారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. సాక్షులను ఎంపీ అదే పనిగా బెదిరిస్తున్నారని తర నిందితులతో కలిసి ఎంపీ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. ఎంపీ అవినాష్‌కు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోందని.. అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతు ఉందన్నారు. సీబీఐ అధికారులపై అవినాష్ తప్పుడు ఫిర్యాదులు చేశారని ప్రైవేటు కేసులు నమోదు చేయించారనికోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణ 19కి వాయిదా పడింది.
తన వాదనల్లో సునీత జగన్ ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. అవినాష్‌కు అసెంబ్లీ సాక్షిగా జగన్ క్లీన్చిట్ ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్న సునీత వివేకా హత్య గురుంచి జగన్‌కు ముందే తెలిసిందని వాదించారు. జగన్‌కు ముందే తెలిసిన విషయాన్ని సీబీఐ తాజాగా బయటపెట్టిందన్నారు. దాదాపుగా అన్ని అంశాలపై సునీతతన వాదనలు వినిపించారు. అయితే దర్యాప్తు ఎలా జరుగుతోందన్నది సీబీఐ పరిధిలోని అంశమని.. తాము నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేయడానికి సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది.