వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కూడా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సునీత పార్లమెంట్‌కు.. అసెంబ్లీకి షర్మిల పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై వైసీపీ వర్గాలకు సమాచారం రావడంతో సునీతను ప్రభావితం చేసే పనులు ప్రారంభించారని చెబుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా సునీతకు ఫోన్ చేసి రాజకీయంగా ఎదైనా స్టెప్ తీసుకుంటే నష్టపోతారని బెదిరింపుతో కూడిన సలహా ఇచ్చినట్లుగా షర్మిల క్యాంప్ నుంచి మీడియాకు లీక్ వచ్చింది.
వైఎస్ సునీత, షర్మిల ఇద్దరూ జగన్ రెడ్డిపై రాజకీయం చేస్తే కడపలో సంచలనాత్మక మార్పులు వస్తాయి. ఆ ప్రభావం రాష్ట్రం అంతటా పడుతుంది. అందుకే అన్యాయానికి గురైన చెల్లెళ్లు ఇద్దరూ రాజకీయంగా పోరాటం ప్రారంభించేసరికి సీఎం జగన్ కు వణుకుపుడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో తన తండ్రి హత్యపై పోరాడుతున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సునీత టీడీపీలో చేరి పోటీ చేస్తుందని ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రెస్ మీట్లలో అదే చెప్పేవారు. సునీతపై టీడీపీ ముద్ర వేసేవారు.
అయితే ఇప్పుడు జగన్ రెడ్డి భార్య భారతి తరపు బంధువులు తప్ప అందరూ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతున్న సూచనలు కనిపిస్తూండటంతో తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోతుందని కంగారు పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక గింజుకుంటున్నారు. బెదిరింపులకు సైతం దిగుతున్నారు. వైఎస్ వివేకాకు పట్టిన గతే పడుతుందని ఇప్పటికే షర్మిలకు సజ్జల హెచ్చరికలు పంపారు. ముందు ముందు వైఎస్ ఫ్యామిలీ రాజకీయం మరింత రక్తి కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.