తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె కడప జిల్లా ఎస్పీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. తన ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహిస్తున్నారని .. ఇప్పటికే సీఐకు ఫిర్యాదు చేయగా.. ఆయన విచారణ జరిపారని.. వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితుడు అయిన శివశంకర్ రెడ్డి అనుచరుడు మణికంఠ రెడ్డి ఆ రెక్కీ చేసినట్లుగా గుర్తించారన్నారు. తక్షణం తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వైఎస్ సునీత భద్రత కోసం లేఖ రాయడం ఇదే మొదటి సారి కాదు .. గతంలో రెండు సార్లు లేఖలు రాశారు.
ఎంత భద్రత కల్పించారో క్లారిటీ లేదు కానీ ఇప్పుడు తన ఇంటి చుట్టూ రెక్కీ జరిగిందని ఆమె చెప్పడం.. పోలీసుల విచారణలో నిజమని తేలిందని చెప్పడమే కలకలం రేపుతోంది. శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు.. రైట్ హ్యాండ్ లాంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనే వ్యక్తితో పాటు చనిపోయేదాకా వివేకాకు పీఏగా ఉన్న కృష్ణారెడ్డిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో మెల్లగా కీలక నిందితులను ప్రశ్నించే దిశగా సీబీఐ యంత్రాంగం కదులుతున్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు ఒక్కొక్కరిగా వైఎస్ కుటుంబంలోని వారికి సీబీఐ నోటీసులు జారీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
కర్ణాటకలో జరిగిన సెటిల్మెంట్లు… వివాదాలు.. అక్కడి రెవిన్యూ, బ్యాంక్ అధికారుల ద్వారా సీబీఐ మొత్తం సమాచారం తెప్పించుకుంది. రెండురోజుల క్రితం దాదాపుగా ఇరవై వాహనాల్లో కర్ణాటక నుంచి బ్యాంక్, రెవిన్యూ అధికారులు వచ్చారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. ఇప్పటి వరకూ సునీల్ యాదవ్ ఒక్కరినే అరెస్ట్ చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని ఓ సీబీఐ బృందం ప్రశ్నిస్తోంది. మరో బృందం ఆయన చెప్పిన వివరాల ఆధారాలంగా సాక్ష్యాల కోసం సోదాలు చేస్తోంది. వివేకా కేసులో రోజువారీ మలుపులే సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది.