వైఎస్ వివేకా కూతురు సునీత ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. బుధవారం సచివాలయానికి వచ్చిన సునీత , వంగలపూడి అనితతో భేటీ అయి వివేకా హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి వివరించారు. ఈ హత్య తర్వాత జరిగిన పరిణామాలన్నింటిని హోంమంత్రికి వివరించిన సునీత..ఈ కేసులో ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కోరారు.
ప్రస్తుతం ఈ కేసు సీబీఐ పరిధిలో ఉండటంతో ప్రభుత్వం తరఫున దోషులకు శిక్ష పడేలా వ్యవహరిస్తామని సునీతకు అనిత హామీ ఇచ్చారు. విచారణను నీరుగార్చేలా చేసిన పోలీసులను వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. దోషులు ఎంతటి వారైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని..కూటమి ప్రభుత్వం న్యాయం పక్షాన చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు.
వైసీపీ హయాంలో వివేకా హత్యకేసులో దోషులకు శిక్ష పడేలా చేయాలంటూ జగన్ ను కలిసి కోరిన సునీత..ఆయన ఇచ్చిన రిప్లైతో సీబీఐ విచారణ కోసం న్యాయపోరాటం కొనసాగించారు. ఆ తర్వాత జగన్ సీబీఐ విచారణకు అడ్డు తగిలేలా వ్యవహరించవద్దని ఆమె అప్పీల్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని జగన్ అరెస్టు కాకుండా కాపాడుతున్నారని సునీత ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వం తరఫున న్యాయం కోసం కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక హోంమంత్రి వంగలపూడి అనితను కలిసిన సునీత..వివేకా హత్యకేసులో న్యాయం చేసేలా ప్రభుత్వం నుంచి చొరవ చూపాలని కోరగా అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు.