వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి .. షర్మిలతో పాటే ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లుగా ఉంది. ఖమ్మంలో ఏర్పాటు చేసిన సంకల్పసభకు వెళ్లి ప్రారంభవాక్యాలు పలికిన ఆమె… ఇప్పుడు ఉద్యోగదీక్షలోనూ కుమార్తెతో పాటుగా కూర్చున్నారు. వైసీపీతో సంబంధం లేకుండా.. సొంతంగా పార్టీ పెట్టుకుంటున్న షర్మిల వెంటనే.. వైసీపీ గౌరవాధ్యక్షురాలు తిరగడం.. ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇప్పటికే చర్చనీయాంశం అయింది. జగన్ కంటే షర్మిలకే వైఎస్ విజయలక్ష్మి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో… విజయలక్ష్మి వేస్తున్న అడుగులు.. కూడా ఆ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి.
నిజానికి ఓ పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నందున.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కరెక్ట్ కాదని విజయలక్ష్మికి చెప్పే ఉంటారు. కానీ ఆమె మాత్రం.. కుమారుడి కన్నా కుమార్తెకే ప్రాధాన్యం ఇస్తున్నందు వల్ల ఇక చురుగ్గా.. తెలంగాణలోనే రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. షర్మిల రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెబుతున్న వైసీపీ పెద్దలకు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. షర్మిల పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని.. వద్దని చెప్పారని కూడా సజ్జల చెప్పుకొచ్చారు. కానీ.. ఇప్పుడు గౌరవాధ్యక్షురాలే.. ఆ పార్టీకి మెంటార్‌గా వ్యవహరిస్తున్నట్లుగా ఉండటంతో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.
షర్మిల పార్టీతో సంబంధం లేదని చెప్పుకోవాలంటే ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మిని గౌరవ అధ్యక్షురాలి హోదా నుంచి తొలగించాల్సి ఉంటుంది. అలా తొలగిస్తే.. జగన్‌పై బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. ఒక వేళ తొలగించకపోతే.., డబుల్ గేమ్ ఆడుతున్నారన్న అనుమానం బలపడుతుంది. వైసీపీ పెట్టినప్పటి నుండి .. గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయలక్ష్మి ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందికరమైన పనులు చేస్తున్నారు. మరి అధ్యక్షుడు జగన్ రెడ్డి ఏం చేస్తారో మరి..!