పాదయాత్రను అడ్డుకోవడం ఎంత చేతకాని తనమో.. వివరిస్తూ వైఎస్ విజయలక్ష్మి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి అందరూ.. ఫక్కున నవ్వుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో పాలన చేస్తున్న ఆమె కుమారిడికి ఆ వీడియో వంద శాతం వర్తిస్తుంది. ఆమె నేరుగా తన కుమారుడ్నే విమర్శిస్తున్నట్లుగా ఉంది. అంతేనా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలూ వైరల్ అయ్యాయి. పాదయాత్రకు అనుమతులే అక్కర్లేదనేది ఆయన వాదన. ఇలాంటి వీడియోలో సోషల్ మీడియాలో అందరికీ కనిపిస్తున్నాయి.
అంతేనా అసలు పాదయాత్రలు చేసి ఎలా అధికారంలోకి వచ్చారో.. వైఎస్ ఫ్యామిలీ అటు తెలంగాణ.. ఇటు ఏపీలో రోడ్లన్నీ తమవే అన్నట్లుగా ఓదార్పు యాత్రలు.. పాదయాత్రలు ఎలా చేశారో కథలు కథలుగా వివరిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తూండటం .. పోలీసులు కూడా వింత వింత ప్రశ్నలు అడుగుతూండటంతో … అందరూ ట్రోల్ చేస్తున్నారు. జగన్ ఉన్న ప్రజాస్వామ్య హక్కు ఇతరులకు ఎందుకు ఉండదని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోలతో వైసీపీ ట్రోలింగ్ కు గురవుతోంది.
లోకేష్ పాదయాత్ర విషయంలో ప్రభుత్వం భయపడుతోందని.. వైసీపీ కంగారు పడుతోందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలు అడ్డుకుంటామనే ప్రకటనలు చేశారు. దాడులు చేస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తే ఎందుకు ఇంత భ యపడుతున్నారన్న ప్రశ్న సహజంగానే వారికి ప్రజల నుంచి వస్తోంది. కానీ సమాధానం చెప్పుకోవడానికి వారి వద్ద ఏమీ లేదు. పాదయాత్రను అడ్డుకోవడం లేదనే కబుర్లు చెబుతున్నారు కానీ.. జరుగుతున్న పరిణామాలను మాత్రం సమర్థించుకోలేకపోతున్నారు.
కారణం ఏదైనా… జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు.. గతంలో అనుభవించిన రాజకీయ స్వేచ్చ.. నాడు – నేడు పేరుతో ఇప్పుడు ప్రజల ముందు కనిపిస్తోంది. ఆయన మాట.. నడక అంతా మోసమన్న అభిప్రాయాన్ని కల్పిస్తోంది. కాదు.. నిజం అని నిరూపించుకోవాలంటే.. గతంలో తాను ప్రతిపక్ష నేతగా ఎంత ప్రివిలజెస్ ను ప్రజాస్వామ్య బద్దంగా అనుభవించారో అంత ఇప్పుడు ప్రతిపక్ష నేతలకు కల్పించాలి. లేకపోతే.. . మోసం చేశారనే ప్రజలు అనుకుంటారు.