ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తవుతున్న సందర్భంలో వైయస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో మాట్లాడారు. జగన్ పాదయాత్ర చేయడాన్ని మెచ్చుకున్నారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేసిన చరిత్ర తమకే దక్కిందని సంతోషించారు. మహాత్మా గాంధీ పాదయాత్ర చేశారుగానీ… ఒకే ఇంటి నుంచి ముగ్గురు చేసిన చరిత్ర లేదన్నారు! వైకాపా ప్లీనరీలో తన అబ్బాయిని ప్రజలకు అప్పగిస్తున్నట్టు ప్రకటించాననీ, అప్పట్నుంచీ జగన్ ని జనం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు ఉన్న పరిస్థితులే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయనీ, ప్రజలు కష్టాల్లో ఉన్నారనీ, చాలామంది పొట్టకూటి కోసం వలసలు పోతున్నారనీ, ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టే జగన్ పాదయాత్రకు బయల్దేరాల్సి వచ్చిందన్నారు విజయమ్మ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జగన్ కరిగిపోతాడనీ, ఆప్యాయత చూపుతాడనీ, మాటిస్తే నిలబడతాడనీ, మడం తిప్పడనీ చెప్పుకొచ్చారు.
ఒక తల్లిగా జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రను విజయమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది కచ్చితంగా ఆనందించదగ్గ సందర్భమే. కానీ, వైకాపా గౌరవ అధ్యక్షురాలిగా… రాష్ట్ర ప్రజలకు అవసరమైన నాయకత్వాన్ని జగన్ ఇవ్వగలరనే భరోసా ఆమె వ్యాఖ్యల్లో ఎక్కడా కనిపించలేదు. విభజన అనంతరం అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురౌతున్న రాష్ట్రానికి వైకాపా ఏం చెయ్యగలదనేది ఆమె చెప్పలేకపోయారు. ప్రతిపక్ష పార్టీగా నాలుగున్నరేళ్లపాటు ప్రజలు తరఫున బలంగా నిలబడ్డ సందర్భాలను ప్రస్థావించలేకపోయారు. ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని కూడా సమర్థంగా సమర్థించుకోలేకపోయారు.
అన్నింటికీమించి, రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న కీలక ప్రశ్న ప్రస్థావనే లేదు! రాబోయే ఐదేళ్లలో ఆంధ్రా అభివృద్ధికి వైకాపా ఏం చెయ్యగలదు..? రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, కేంద్రం నుంచి నిధుల సాధన, విదేశాల నుంచి పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన, ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమం… వీటన్నింటినీ సాకారం చేయగలిగే సమర్థత ప్రతిపక్ష నేత జగన్ లో ఉందని చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వానికి జగన్ ఎలా ప్రత్యామ్నాయం, ఎందుకు ప్రత్యామ్నాయం అనేది వివరించలేదు. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే జగన్ కి ఉన్న అర్హతగా చెప్పుకొచ్చారే తప్ప… ఒక సమర్థుడైన నాయకుడిగా, ఒక విజనరీ లీడర్ గా పాదయాత్ర ద్వారా ప్రజలు చూస్తున్నారా లేదా అనే కోణం నుంచి జగన్ ను విశ్లేషించలేకపోయారు విజయమ్మ.