వైఎస్ వివేకా హత్య ఎజెండాగానే ఎన్నికలు జరగాలని.. అలా జరగాలంటే జగన్ తో పాటు అవినాష్ రెడ్డి వారికి మద్దతు ఇచ్చే కుటుంబసభ్యులు కూడా మాట్లాడేలా చేయాలన్న వ్యూహాన్ని షర్మిల, సునీత పాటించారు. ఘాటు విమర్శలు చేయడం తో వారు కూడా తెరపైకి వచ్చారు. షర్మిల ఎన్నికల ప్రచారంలో పూర్తిగా వైఎస్ వివేకా హత్య ఉదంతంపైనే దృష్టి కేంద్రీకరించారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక సునీత వారంలో కనీసం ఒక్క రోజు అయినా ప్రెస్ మీట్ పెట్టిన .. అవినాష్ రెడ్డిపైనే ఘాటు విమర్శలు చేస్తున్నారు.
ఈ విమర్శల జోరు పెరిగిపోతూండటంతో… తాము మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రొద్దుటూరులో జగన్ స్పందించారు. దేవుడికి తెలుసంటా ఆయన చేసిన వ్యాఖ్యలతో డ్యామేజ్ పెరిగింది. తాజాగా అవినాష్ రెడ్డి, రవీంధ్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరింతగా చర్చ ప్రారంభమయింది. అవినాష్ రెడ్డి ఏమీ చేయలేదని.. సాక్ష్యాలు తుడిచేస్తూంటే.. చూస్తూ కూర్చున్నారని రవీంద్రనాథ్ రెడ్డి వెనకేసుకు వచ్చారు. ఆ మాటలు విన్న వాళ్లకు.. ప్రజలకు ఏమీ తెలియదని.. వైఎస్ వివేకా హంతకులు భావిస్తున్నట్లుగా ఎవరికైనా అనిపిస్తుంది.
ఇక అవినాష్ రెడ్డి అయితే షర్మిలపై విరుచుకుపడ్డారు. మనిషి పుట్టుక పుట్టావా అని ప్రశ్నించడం ప్రారంభించారు. తాను సైలెంట్ గా ఉంటే.. బురద పూసేస్తున్నారని.. షర్మిల చేస్తున్న ఆరోపణలు భయంకరంగా ఉన్నాయంటున్నారు. ఆయన షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరుగుతుంది. వివేకా హత్య కేంద్రంగానే ఎన్నికలు జరగాలన్న లక్ష్యంతో షర్మిల, సునీత ఉన్నారు. అప్పుడే న్యాయం జరుగుతుందనుకుంటున్నారు. తమకు ప్రజా తీర్పు కావాలని కోరుతున్నారు. ఈ విషయంలో వారు మొదటి అడుగు విజయవంతంగా వేసినట్లే అనుకోవచ్చు.