వైసీపీ అధినేత జగన్ కు మరో షాక్. సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా షర్మిలను గెలిపించాలని పిలుపునిచ్చి వైసీపీకి షాక్ ఇచ్చిన విజయమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ షర్మిల నిర్వహించబోయే కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్న విజయమ్మ పూర్తిగా షర్మిల రాజకీయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో తండ్రి వైఎస్సార్ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించేందుకు షర్మిల ఏర్పాట్లు చేశారు. జులై ఎనిమిదిన జరిగే ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ లను షర్మిల ఆహ్వానించారు.
ఇది పూర్తిగా కాంగ్రెస్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు షర్మిల. అందుకే ఆమె కాంగ్రెస్ అగ్రనేతలను ఈ వేడుకలకు హాజరు కావాలంటూ ప్రత్యేకంగా కలిసి కోరారు. అగ్రనేతల హాజరు విషయాన్ని అటుంచితే, ఈ కార్యక్రమానికి విజయమ్మ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి విజయమ్మ హాజరవుతే అది జగన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బే.
కొంతకాలంగా జగన్ కంటే కూడా రాజకీయంగా షర్మిలకే విజయమ్మ ఎక్కువగా అండగా నిలుస్తున్నారు. జగన్- షర్మిలకున్న విబేధాల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నిర్వహిస్తోన్న వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో విజయమ్మ పాల్గొంటే తల్లి జగన్ కు మరింత దూరమైనట్లే. రాష్ట్రంలో వైసీపీని కాదని కాంగ్రెస్ ను బలపరచాలని పరోక్షంగా సంకేతాలు పంపినట్లే అవుతుంది. దీంతో విజయమ్మ ఏం చేయనున్నారు..? అనేది బిగ్ డిస్కషన్ గా మారింది.