తెలంగాణలో రాజకీయ పార్టీని తొమ్మిదో తేదీన ప్రకటించనున్నారు షర్మిల. ఇందు కోసం ఖమ్మంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తామని అధికారులకు హమీ ఇస్తున్నారు కానీ.. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా కొంత మందిని గుర్తించి వారికి అనధికారికంగా బాధ్యతలు ఇవ్వడంతో వారే జనసమీకరణ చేయబోతున్నారు. షర్మిల తన పార్టీని.. తల్లి విజయలక్ష్మి చేతుల మీదుగానే ఆవిష్కరింప చేయబోతున్నారు. పార్టీ పేరు, జెండా విజయలక్ష్మినే ఆవిష్కరించబోతున్నారు. ఖమ్మం సభకు ఆమె ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.
షర్మిల పార్టీ ఏర్పాటుకు విజయలక్ష్మి మొదటి నుంచి మద్దతుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అవుతుందని .. పార్టీ పెట్టవద్దని ఆమె నచ్చచెప్పలేదని తాజా పరిణామాలతో తేలిపోతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. షర్మిల పార్టీ పెట్టడం.. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే చెప్పారు. మూడు రోజుల కిందట… విజయలక్ష్మి పేరిట విడుదలైన లేఖపైనాసందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె బహిరంగసభ ద్వారా ప్రజల్లోకి వస్తున్నారు. ఈ కారణంగానే సభపై ఆసక్తి ఏర్పడింది.
జగన్తో విబేధించి తెలంగాణలో పార్టీ పెట్టినప్పటికీ.. ఖమ్మం సభలో… జగన్కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేసే అవకాశం లే్దు. కుటుంబంలో గొడవలు ఉన్నాయన్న విషయాన్ని అంతర్గతంగానే ఉంచుకోవాలని మీడియా ముందుకు తీసుకు రాకూడదన్న అభిప్రాయంలో కుటుంబసభ్యులు ఉన్నారు. వైఎస్ సునీతకు షర్మిల అండగా ఉన్నారన్న ప్రచారం నేపధ్యంలో… విజయలక్ష్మి ప్రసంగంపైనా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆమె రాసినట్లుగా చెబుతున్న లేఖలోని అంశాలను బహిరంగసభలో వినిపిస్తే… కాస్త క్లారిటీ వస్తుంది. స్పందించకపోతే మాత్రం ఆ లేఖపై అనుమానాలు పెరిగిపోతాయి.