వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన “కేబినెట్” భేటీని నిర్వహించాలని వైఎస్ విజయలక్ష్మి నిర్ణయించారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే “మంత్రివర్గం”లోని వారి సగౌరవంగా పిలుపులు వెళ్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ సీఎంగా ఉన్నారు. ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెంది ఇతర పార్టీల్లో ఉన్న వారికి కూడా ఈ పిలుపులు వెళ్తున్నాయి. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఈ “మంత్రివర్గ” సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్ మంత్రివర్గంతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన వారికి కూడా ఆహ్వానాలు వెళ్తున్నాయి. వారిలో కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, డీఎస్, రాజ్యసభ సభ్యుడు కె.ఆర్ సురేష్‌రెడ్డి వంటి వారు ఉన్నారు. అందర్నీ విజయమ్మ స్వయంగా ఫోన్‌చేసి ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమం వెనుక రాజకీయ ఉద్దేశాలేవీ లేవని చెబుతున్నారు. అందుకే అందరూ హాజరవుతారని భావిస్తున్నారు. కానీ వైఎస్ చనిపోయిన తర్వాత పన్నెండేళ్లుగా పెట్టని ఇలాంటి సమావేశాన్ని .. ఇప్పుడే ఎందుకు పెట్టాలనుుటున్నారనే సందహం సహజంగానే వస్తుంది. ఆ సమావేశం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం.. షర్మిల రాజకీయ పార్టీ వ్యవహారాల్లో విజయలక్ష్మి కూడా తెర వెనుక చురుగ్గా ఉన్నారన్న ప్రచారం నేపధ్యంలో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది.
షర్మిల పార్టీలోకి రావాల్సిందిగా ఆమె గతంలో చాలా మందిని స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానించారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్ కూడా తనను విజయమ్మ ఫోన్ చేసి ఆహ్వానించారని కొన్ని ఇంటర్యూల్లో చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయలక్ష్మి ఆత్మీయ సమావేశం వెనుక రాజకీయం లేదని అనుకోలేమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్ మంత్రివర్గంలో ఉన్న ఏపీకి చెందిన అనేక మంది ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. మంత్రి పదవులు లేకపోయినా ఇతర పదవులతో వైసీపీలోనే ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే వేరే పార్టీల్లో ఉన్నారు.
సమావేశానికి ఏదో ఓ అజెండా ఉంటుందని కానీ.. అజెండా ఏమిటన్నదానిపై మాత్రం ఆహ్వానాల్లో మాత్రం స్పష్టత లేదు. సమావేశం అయిపోయిన తర్వాతనే రాజకీయ ఎజెండా ఉందా లేదా అన్నదానిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.