పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించడానికి ఖమ్మంలో షర్మిల ఏర్పాటు చేసిన సంకల్ప సభకు వైఎస్ విజయలక్ష్మి హాజరవుతున్నారనే సరికి చాలా మందికి ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే.. రాజకీయాల విషయంలో కుమారుడు జగన్, కుమార్తె షర్మిల మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయని తెలిసిన తర్వాత ఆమె ఎటు వైపు అన్న చర్చ జరుగుతోంది. అయితే జగన్ కంటే.. షర్మిల వైపే విజయలక్ష్మి మొగ్గు ఉందని… కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో… విజయలక్ష్మి షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన సభకు రావడం అందరికీ ఆసక్తి కలిగించింది. స్టేజ్ పై నుంచి ఏం చెబుతారన్నదానిపై రకరకాల చర్చలు జరిగాయి. ఈ చర్చలకు కారణం ఉంది. కుటుంబంలో విబేధాలు వచ్చాయని.. విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆమె ఓ లేఖ రాశారు. కుటుంబంలో గొడవల్లేవని ఆ లే్ఖలో చెప్పారు. కానీ లేఖలో సంతకం లేదు.
సంతకం లేని లేఖను విడుదల చేసిన తర్వాత తొలి సారిగా బహిరంగంగా మాట్లాడే అవకాశం వచ్చిన విజయలక్ష్మి… వాటిలోని అంశాలను ప్రస్తావిస్తారని అనుకున్నారు. ఆమె అంత ఎమోషనల్ అయి.. ఐదు పేజీల లేఖ రాసినప్పుడు.. ఆ లేఖపై అనుమానాలు ప్రారంభమైనప్పుడు… వాటిలోని అంశాలను ఎందుకు ప్రస్తావించలేదన్నది ఇప్పుడు చాలా మందికి తొలుస్తున్న అనుమానం. నిజంగా ఆ లేఖ ఆమె రాసి ఉంటే ఖచ్చితంగా..అందులో అంశాలను కొన్ని అయినా ప్రస్తావించి ఉండేవారని.. కానీ ఆ లేఖ ఆమె ప్రమేయం లేకుండా వచ్చింది కాబట్టే అందులోని అంశాలను ప్రస్తావించలేదన్న చర్చ జరుగుతోంది.
ఐదు పేజీల లేఖలో షర్మిల ప్రస్తావన కూడా ఉంది. షర్మిలనే రాజకీయ పార్టీ పెడుతున్నారు. అలాంటప్పుడు కుటుంబంలో విబేధాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ విజయలక్ష్మి అవేమీ పట్టించుకోలేదు. ఎప్పట్లాగే తన బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాననంటూ సెంటిమెంట్ పండించారు. కానీ అసలు విషయాలను మాత్రం మరుగున పరిచేశారు. ఇప్పుడు… వైఎస్ కుటుంబంలో ఎవరూ ఎదుర్కోనంత ఒత్తిడి వైఎస్ విజయలక్ష్మి ఎదుర్కొంటున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.