వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయలక్ష్మి వచ్చారు. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తల్లి విజయలక్ష్మి మద్దతు జగన్‌కు ఉన్నట్లేనా అని చర్చించుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ఇడుపుల పాయకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమెతో పాటు ప్రత్యేక విమానంలో విజయలక్ష్మి వచ్చారు. కుమార్తె షర్మిలను కూడా ఆశీర్వదించారు. అంటే.. అటు కుమారుడికి.. ఇటు కుమార్తెకు కూడా ఆమె మద్దతుగా ఉంటున్నారు.
జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిల -విజయమ్మకు ఇరకాటం
తన ఇద్దలు బిడ్డలు రెండు కళ్ల లాంటి వారని.. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసినప్పుడు విజయమ్మ ప్రకటించారు. ఇద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారని అది దైవ సంకల్పమని సర్ది చెప్పుకున్నారు. తాను కుమార్తెకు ఉండటానికి రాజీనామా చేశానన్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. షర్మిల కూడా ఏపీకి వచ్చారు. జగన్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. అంటే రెండు కళ్లలో ఒక కంటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితిలో విజయమ్మ పడిపోయారు. ఎవర్నీ వదులుకోలేకపోతున్నారు. అందుకే ఏ కార్యక్రమానికి పిలిచినా వెళ్తున్నారు.
వివేకాను చంపిన అవినాష్‌కు మద్దతా అనే ప్రశ్నలు
జగన్ వైపు ఉండటానికి విజయమ్మ కూడా ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే జగన్ వివేకానందరెడ్డి హ త్య కేసులో ప్రధానంగా పేరు వినిపిస్తున్న అవినాష్ రెడ్డికే టిక్కెట్ ఇచ్చారు. వివేకాను చంపింది అవినాషేనని.. షర్మిల గట్టిగా ఆరోపిస్తున్నారు. తన ఎంపీ టిక్కెట్ కోసం పోరాడినందునే ఆయనను చంపేశారని షర్మిల బాధపడుతున్నారు. అందుకే సునీత కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నారు. అవినాష్ రెడ్డికి జగన్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడుతున్నందున.. షర్మిల విరుచుకుపడుతున్నారు.
షర్మిలకే విజయమ్మ సపోర్ట్ – కానీ బయటకు చెప్పలేని నిస్సహాయత
విజయమ్మ మనసు షర్మిల వైపే ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం కుమారుడుతో పెద్దగా మాటల్లేవు. ఆమె షర్మిల వద్దే ఉంటున్నారు. విజయమ్మ పుట్టిన రోజును కూడా జగన్ పట్టించుకోవడం లేదు. కానీ రాజకీయంగా తల్లి కూడా దూరమైందని రాజకీయంగా వచ్చే విమర్శలు తప్పని చెప్పడానికి అప్పుడప్పుడు సెంటిమెంట్ ప్రయోగించి విజయమ్మను తనతో కనిపించేలా చేసుకుంటున్నారు. అందుకే విజయమ్మ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కుమార్తెకు అండగా ఉంటానని చెప్పలేకపోతున్నారు.