వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదు నెలలు దాటిపోయింది. హత్య జరిగిన సమయంలో.. టీడీపీ అధికారంలో ఉంది. ఎన్నికల ప్రచారం అప్పుడే ప్రారంభమవుతోంది. అలాంటి సమయంలో… వివేకా హత్య జరగడం… ఆ హత్య విషయాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేయడం… ఆత్మహత్యగా ప్రచారం చేయడం మొత్తం వ్యవహారం కలకలం రేపింది. సాక్ష్యాలు తారుమారు చేసిన వ్యవహారంలో… పలువురిపై కేసులు నమోదు చేశారు. వారు కూడా… బెయిల్ పై బయటకు వచ్చారు. అసలు నిందితులు ఎవరు..? ఎందుకు చేశారన్నదానిపై పోలీసులు ఇంత వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు ఇప్పటికీ ఇవే ఆరోపణలు చేస్తున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు నిందితులకు గుజరాత్లో నార్కో పరీక్షలు చేయించారు. అందులో ఏం తేలిందో కానీ.. కొత్తగా.. కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభించినట్లుగా ప్రకటించారు. వైఎస్ కుటుంబసభ్యులను మరోసారి ప్రశ్నించినట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. పులివెందులలో ఇప్పటివరకు 300 వందల మందికి పైగా…అనుమానితులను విచారించారని.. త్వరలో కీలక సూత్రధారులతో పాటు మరిన్ని అరెస్ట్లు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. హత్య జరిగినప్పుడే.. డ్రైవరే కొట్టి చంపాడన్నట్లుగా.. ఓ లేఖను.. వైఎస్ కుటుంబసభ్యులు పోలీసులకు అప్పగించారు. ఆ లేఖ అసలైనదో.. ఫేకో ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత పలువురు అనుమానితుల పేర్లు బయటకు వచ్చాయి.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక.. సాక్షిగా ఉన్న వాచ్మెన్కు… నార్కో పరీక్షలు చేయించేందుకు కోర్టు అనుమతి తీసుకోవడంతో కేసును…. మరో కోణంలో ముగింపునకు తీసుకొస్తున్నారన్న అభిప్రాయం సహజంగానే ప్రారంభమయింది. త్వరలో అరెస్టులని పోలీసులు చెబుతున్నారు కాబట్టి.. త్వరలోనే కేసును ఓ ముగింపు ఇచ్చేందుకు… అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయనే భావన ఏర్పడుతోంది.