వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఓ సంచలనం. చంపిన వాళ్లు సాక్ష్యాలను మాయం చేయాలని చూశారు. గుండెపోటు అని నమ్మించాలని ప్రయత్నించారు.చివరికి రక్తపు వాంతులతో చచ్చిపోయాడనే కథ అల్లారు. అన్నీ అయ్యాక ఆయన ఫోటోలు బయటకు వచ్చాక.. ఇక తప్పదని రాజకీయ ప్రత్యర్థులు హత్యచేశారని ప్రచారం ప్రారంభించారు. మొదట చూసిన ఎవరికైనా అత్యంత ఘోరంగా చంపేసిన విషయం తెలుస్తుంది. కానీ వాళ్లు మాత్రం.. దాచి పెట్టి.. బయటపడేసరికి.. చంద్రబాబు చంపేయించాడని ఆయన చేతుల్లో గొడ్డలి పెట్టి కథలు ప్రచారంలోకి తెచ్చారు. ఇప్పుడు ఆ కేసులో సాక్షులు వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు.
సాల్వ్ చేయాలంటే చాలా చిన్న కేసు వివేకా హత్య కేసు
వివేకా హత్యకు గురై ఇప్పటికి ఆరేళ్లు దాటిపోయింది. అడ్డగోలుగా దొరికిపోయిన హత్య కేసు. హత్య చేసిన వాళ్లు తప్ప మిగిలిన వాళ్లు ఎవరూ సాక్ష్యాలను మాయం చేయరు. గుండెపోటు అని చెప్పి పోస్టుమార్టం కూడా లేకుండా అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నించారు. ఇంత చిన్న లాజిక్ తో విచారణ జరిగితే వారం రోజుల్లో అసలు నిందితులంతా తేలిపోతారు. కానీ ఆరేళ్లుగా ఈ హత్య కేసులో వ్యవస్థలు అడ్డం పడి.. నిలువుగా పడి.. విచారణ జరిపి.. ఆపేసి.. ఏం సాధిస్తున్నాయో కానీ..బాధితులకు మాత్రం న్యాయం ఇక జరగదేమో అన్నంత నిర్వేదం వస్తోంది.
సాక్షులంతా చనిపోయాక.. కేసు క్లోజ్ చేస్తారా ?
ఇప్పటికి ఐదుగురు సాక్షులు అనుమానాస్పదంగా చనిపోయారు. ఇంకెంత మంది చనిపోతారో తెలియదు. కానీ కేసు మాత్రం ముందుకు సాగడం లేదు. దర్యాప్తు కూడా సాగడం లేదు. ఎక్కడ ఉందో.. అక్కడే ఉంది. నిందితులు అందరూ బెయిల్స్ తెచ్చుకుని తమ నేరవృత్తిని కొనసాగిస్తున్నారు. చివరికి సీబీఐ మీద కూడా కేసు పెట్టిన తెంపరితనంతో వ్యవహరించిన నిందితుల్ని ఎందుకు వదిలేస్తున్నారో.. ఎందుకు ఉపేక్షిస్తున్నారో వ్యవస్థలకే తెలియాలి.
వ్యవస్థలపై ప్రజలు నమ్మకం కోల్పోవడం ప్రమాదకరం
వివేకా కేసు అనేది చాలా సింపుల్ కేసు. పోలీసులు చేధించే ఎన్నో కేసులను పరిశీలిస్తే ఇది నిజమని అర్థమవుతుంది. కానీ ఇందులో నిందితులు పలుకుబడి ఉన్నవాళ్లు కాబట్టి వాళ్ల జోలికి చట్టం రావడం లేదు. ఈ సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. వ్యవస్థలు ఇంత ఘోరంగా విఫలమైతే.. ప్రజలు నమ్మకం కోల్పోతే.. అసలుకే మోసం వస్తుంది. ఇంకెంత కాలం వివేకా కేసును సాగదీస్తారో ఎవరికీ తెలియదు. న్యాయంకోసం పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె, అల్లుడు ..తమపైనే ఆ కేసును వేయాలని చూసినా పోరాడుతున్నారు. వారి పోరాటానికేమైనా అర్థం లభిస్తుందో లేదో ?