వైఎస్ వివేకా హత్య కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సీబీఐ కూడా దర్యాప్తు ఆపేసింది. కానీ మరో కోణంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ కేసులో ఏ 2గా ఉన్న సునీల్ యాదవ్ కూడా పశ్చాత్తాపం చెందుతున్నారు. ఈ విషయంలో వివేకం సినిమాలో చూపించినదంతా నిజమేనని ఆయన మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన హత్య కేసులో వివేకం సినిమాలో చూపించింది నిజమేనని అంగీకరించడంతో ఆయన కూడా అప్రూవర్ గా మారేందుకు రెడీ అవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మరో వైపు అవినాష్ రెడ్డి లెఫ్ట్ హ్యాండ్… శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి చుట్టూ ఇప్పటికే ఉచ్చు బిగుసుకుంటోంది. దస్తగిరిని కేసులు పెట్టి జైల్లో పెట్టిన తర్వాత ఆయనతో డీల్ మాట్లాడటానికి చైతన్యరెడ్డి జైల్లోకి వెళ్లారు. ఇందు కోసం డబ్బుల బ్యాగ్ కూడా తీసుకెళ్లారు. లోపలికి వెళ్లి దస్తగిరిని ప్రలోభపెట్టారు. బెదిరించారు. దీనిపై మొత్తం అంతర్గత విచారణ చేసి ఆధారాలతో సహా పోలీసులు సుప్రీంకోర్టు ముందు ఉంచనున్నారు. సీబీఐ అధికారి రాంసింగ్ పెట్టిన తప్పుడు కేసులోనూ ఏం జరిగిందో వెల్లడించబోతున్నారు.
వచ్చే ఫిబ్రవరి, మార్చిల్లో వివేకా హత్య కేసు విషయంలో వివిధ పిటిషన్లపై విచారణలు జరగనున్నాయి. అప్పటికల్లా ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలా పోలీసులు అంతర్గత దర్యాప్తును పూర్తి చేసే అవకాశం ఉంది. వివేకా కుమార్తె సునీత ఈ విషయంలో మరింత యాక్టివ్ గా ఉన్నారు. ఆమె తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న ధ్యేయంతోనే పని చేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి, మార్చి తర్వాత వివేకా హత్య కేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.