వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి స్వగృహంలో కన్నుమూశారు. బాత్రూమ్లో ఆయన విగతజీవిగా పడి ఉండగా.. కుటుంబసభ్యులు గుర్తించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వైఎస్ వివేకాకు 68 ఏళ్లు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరునిగా.. రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన… ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి సహా.. అనేక బాధ్యతలు నిర్వహించారు. పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంట్ స్థానాలకు.. అయితే రాజశేఖర్ రెడ్డి లేకపోతే.. వివేకానందరెడ్డి ప్రాతినిధ్యం వహించేవారు.
వైఎస్ మరణం తర్వాత… వైఎస్ వివేకానందరెడ్డి… జగన్తో విబేధాలొచ్చాయి. సొంత పార్టీ పెట్టుకోవాలని జగన్ అనుకున్నప్పుడు.. వైఎస్ వివేకా ఆయన వెంట వెళ్లలేదు. తన అన్న.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి.. రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్తోనే ఉండాలని అనుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవి కూడా ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. జగన్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ..పులివెందుల అసెంబ్లీకి వచ్చిన ఉపఎన్నికలో… కాంగ్రెస్ తరపున విజయమ్మపై పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ కుటుంబానికి దగ్గరయ్యారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
వైఎస్ వివేకానందరెడ్డి… వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. తనకు కమలాపురం టిక్కెట్ లేదా… కడప పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమలాపురం నుంచి… జగన్ మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డి, కడప పార్లమెంట్ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.