వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున కోర్టులో తన వాదన వినిపించారు. కానీ.. ఆయన పిన్ని, వైఎస్ వివేకా సతీమణి మాత్రం… జగన్ సర్కార్‌పై తనకు నమ్మకం లేదని.. కోర్టులో స్పష్టం చేశారు. ఈ విషయం ఇప్పుడు సంచలనం సృష్టించింది. అమాయకుల్ని నిందితులుగా మార్చి.. అసలు హంతకుల్ని… రక్షించే ప్రయత్నం జరుగుతోందని.. అందుకే.. వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని… హైకోర్టులో వైఎస్ సౌభాగ్యమ్మ తరపు లాయర్లు వాదించారు. టీడీపీకి చెందిన బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలు ఇలా వాదించారు అంటే..ఓ అర్థం ఉంది. కానీ.. వైఎస్ వివేకా సతీమణి కూడా.. సీబీఐ విచారణకే పట్టుబట్టడం కలకలం రేపుతోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు… చంద్రబాబు సర్కార్ పై నమ్మకం లేదని.. రాజకీయంగా కేసును వాడుకుంటున్నారంటూ… వైఎస్ వివేకా సతీమణి, కుమార్తె హైకోర్టులో పిటిషన్లు వేశారు. వారు.. ఎన్నికల సందర్భంలో… టీడీపీపై.. చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేస్తూ.. ఢిల్లీ ఈసీ దగ్గర్నుంచి విజయవాడ ఈసీ వరకూ.. చాలా ఫిర్యాదులు చేశారు. కేసు సీబీఐకి ఇవ్వాలని కోర్టుల్లోనూ పిటిషన్లు వేశారు. అప్పట్లో కోర్టు సిట్‌ను అంతర్గత విచారణ జరపాలని ఆదేశించింది. ఆ తర్వాత అందరూ సైలెంటయిపోయారు. తన భర్త హత్య నిందితుల్ని శిక్షించి న్యాయం చేయాలని.. సౌభాగ్యమ్మ కానీ.. ఆమె కుమార్తె కానీ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాలేదు. వివేకా కేసు చాలా కాన్ఫ్లిక్ట్లతో ఉంది. అది కుటుంబసభ్యుల మధ్య జరిగిన గొడవ అనే ప్రచారం కూడా ఉంది.
వైఎస్ వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై వారి కుటుంబసభ్యుల్లో ఓ స్పష్టత ఉందన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో.. సౌభాగ్యమ్మపై ఎన్నికల సమయంలో కుటుంబసభ్యులు ఒత్తిడి పెంచారని.. ఫలితంగానే ఆమె వారు చెప్పినట్లు చేశారన్న ప్రచారమూ జరిగింది. డ్రైవర్ కొట్టి చంపాడంటూ… వివేకా రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖను సృష్టించడం.. దాన్ని బయటపెట్టడం సహా.. చాలా విచిత్రాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు.. సౌభాగ్యమ్మ కూడా.. కోర్టులో.. అమాయకుల్ని నిందితులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని వాదిస్తూండటంతో.. కేసు ఆసక్తికరమైన మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.