వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై.. ప్రత్యేక దర్యాప్తు బృందం తన పనిని చేసుకోనివ్వాలని.. ఆయన కుమార్తె సునీత విజ్ఞప్తి చేశారు. సిట్‌ను తన పని తాను చేసుకోనివాలన్నారు. వైఎస్ వివేకా హత్య తర్వాత వస్తున్న వార్తలతో తాము ఎంతో బాధపడుతున్నామని వ్యాఖ్యానించారు. సంఘటనా స్థలంలో దొరికినట్లుగా చెబుతున్న లేఖ, నిందితులు ఎవరు..?, సాక్ష్యాలు మార్చారా లేదా.. అన్న విషయాలను దర్యాప్తులో పోలీసులే నిర్ధారిస్తారని వ్యాఖ్యానించారు. తమది 700 మంది ఉన్న కుటుంబం అని.. చిన్న చిన్న కలహాలు ఉంటాయి తప్ప.. విబేధాలేమీ లేవన్నారు. కుటుంబంలో విబేధాలు ఉన్నాయన్న వార్తలు బాధ కలిగిస్తున్నాయన్నారు. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే.. తన దగ్గరే ఉంటున్నారని.. వివేకానందరెడ్డి ఒక్కరే చాలా కాలంగా పులివెందులలో ఉంటున్నారన్నారు.
ఓ వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలంటూ…హైకోర్టులో పిటిషన్ వేసిన సమయంలోనే… సునీత మీడియా ముందుకు వచ్చి సిట్ దర్యాప్తుపై నమ్మకం వ్యక్తం చేయడం.. ఆసక్తికర పరిణామంగా మారుతోంది. అదే సమయంలో సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపేలా.. పెద్దలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైఎస్ వివేకాది హత్య అన్న విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత అప్పటి వరకూ గుండె పోటు అని చెబుతూ వచ్చిన వైసీపీ నేతలు.. ఆ తర్వాత మాట మార్చారు. చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణరెడ్డిలు చంపారంటూ… విమర్శలు ప్రారంభించారు. దానికి కౌంటర్‌గా.. టీడీపీ కూడా.. వైఎస్ వివేకాను.. జగన్మోహన్ రెడ్డినే హత్య చేయించారంటూ.. ఆరోపణలు ప్రారంభించారు. దాదాపుగా.. ప్రతీ ఎన్నికల సభలోనూ.. జగన్మోహన్ రెడ్డి.. తన బాబాయ్‌ను చంద్రబాబే చంపించారని చెబుతున్నారు. చంద్రబాబు కూడా.. జగన్ పై ఇదే తరహా విమర్శలు చేస్తున్నారు. తన తండ్రి హత్యను.. రాజకీయం చేయడంపై.. సునీత బాధపడుతున్నారు.. అది దర్యాప్తుపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన చెందుతున్నారు.
వివేకా హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు కీలకమైన సాక్ష్యాలు సేకరించారు. పరమేశ్వర్ రెడ్డిని ప్రశ్నిస్తూండటంతో.. అసలు కుట్ర అంతా బయటకు వస్తోంది. ఇంటి దొంగల పనేనని ఆయన మీడియా ముందు నేరుగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత.. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యవహారం అంతా బయటకు లాగుతున్నాయి. బెంగళూరులో ఉన్న వందల కోట్ల విలువ చేసే ఓ స్థలం విషయంలోనే… ఇదంతా జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ లోపే.. వైఎస్ వివేకా కుమార్తె మీడియా ముందుకు వచ్చారు.