న్యాయస్థానం సీరియస్ అవడంతో.. అక్రమార్కుల కేసులో ఒక్క శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. కానీ తర్వాత శుక్రవారమే.. ఆయన డుమ్మాకొడుతున్నారు. ఈ శుక్రవారం.. సీబీఐ కోర్టుకు హాజరవడానికి ఆయన ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదు. తెలంగాణ పోలీసులకు.. వస్తున్నట్లుగా సమాచారం అందలేదు. అందుకే వారు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డి.. అమరావతిని తరలించేందుకు నియమించిన హైపవర్ కమిటీతో భేటీ అవుతున్నారు. దీంతో.. ఈ రోజు ఆయన కోర్టుకు డుమ్మానేనని అర్థం చేసుకోవచ్చు.
వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు మినహాయింపు ఇవ్వాలని.. జగన్ పెట్టుకున్న పిటిషన్లను.. కోర్టు నిర్మోహమాటంగా తోసి పుచ్చింది. సీబీఐ కూడా.. తీవ్రంగా వ్యతిరేకించింది. అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డి కావాలనే.. రకరకాల పిటిషన్లు వేసి.. విచారణను ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలను సీబీఐ చేస్తోంది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి.. కోర్టుకు హాజరు కావడానికి సిద్ధంగా లేరు. ప్రతీ సారి .. ఏదో కారణంతో ఆబ్సెంట్ పిటిషన్లు వేయిస్తూనే ఉన్నారు. నిజానికి ఈ వారం.. కీలక విచారణ జరగాల్సి ఉంది.
పెన్నా సిమెంట్స్ కేసులో.. అదనపు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. నిందితులందరికీ.. సమన్లు జారీ చేసింది. ధర్మాన, తెలంగాణ మంత్రి సబిత ఇందులో ఉన్నారు. జగన్ కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.