ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్ చేస్తోంది. గుంటూరు జిల్లా పొన్నూరులో పవన్ పర్యటనను అడ్డుకునేలా వైసీపీ అభ్యర్థి అంబటి మురళి దౌర్జన్యానికి దిగారు.
పొన్నూరులో పవన్ కల్యాణ్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను అర్ధరాత్రి జేసీబీతో అంబటి మురళి తన అనుచరులతో ధ్వంసం చేయించారు. హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను శుక్రవారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పరిశీలించిన తర్వాత అర్దరాత్రి హెలిపాడ్ ను ధ్వంసం చేయడం వైసీపీ అభ్యర్థి పనేనని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పటికే ఎన్నో అవినీతి , అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మురళి హెలిప్యాడ్ ధ్వంసంతో తన అసలు ముసుగును తీసేశారని మండిపడ్డారు ధూళిపాళ్ళ.
పవన్ పొన్నూరు పర్యటనను అడ్డుకునేందుకు మురళి కుయుక్తులు పన్నినా పవన్ ను ఆపలేరని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వస్తే తనకు ఘోరమైన ఓటమి తప్పదనే అక్కసుతో హెలిపాడ్ ధ్వంసం చేశారని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీలో ఓటమి భయం పెరుగుతుందని అందుకే ఈ విధమైన దౌర్జన్యాలు చేస్తోందని దుయ్యబట్టారు.