వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. గడపగడపకూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వైయస్సార్ హయాంలో గ్రామాలకు వెళ్లినప్పుడు రేషన్ కార్డులు లేనివారు లేరనీ, పింఛెన్లు అందుకోని వాళ్లు లేరనీ, సొంత ఇళ్లు లేనివారు లేరని జగన్ అన్నారు. ఆరోజుల్లో మహానేత పాలనని రాజన్న రాజ్యంగా ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటున్నారని అన్నారు. కానీ, ఇవాళ్ల గ్రామాల్లో పరిస్థితి అలా లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక, ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదన్నారు. డ్వాక్వా రుణమాఫీలు జరగలేదనీ, రైతుల రుణమాఫీ ఇవ్వలేదనీ, పేదవాళ్లకి ఇళ్లు కట్టిస్తామని అన్నారనీ.. ఇలా అన్నీ మోసాలే చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు రాష్ట్రానికి పట్టిన శని అన్నారు. రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలనీ, విశ్వసనీయత రావాలనీ, అలా రావాలంటే ఇలాంటి మోసకారి చంద్రబాబును ప్రజలు కాలరు పట్టుకుని నిలదియ్యాలన్నారు. ఈ పరిస్థితి మారాలంటే గ్రామాల్లో తిరగాలనీ, ప్రతీ ఇంటికి వెళ్లి, చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలు, మోసాలు, ద్రోహాలు చెప్పాలన్నారు. అంతేకాదు, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన మంచిని కూడా గుర్తు చేయాలన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని చెప్పాలన్నారు. ఇదే సమయంలో ప్లీనరీలో చెప్పిన నవరత్నాలను ప్రతీ ఇంటికీ తీసుకెళ్లాలనీ, రాబోయే రోజుల్లో జరగబోతున్న అభివృద్ధి గురించి చెప్పాలన్నారు. సమస్యలన్నీ గుర్తించాలనీ… వాటిని మనం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదిక పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సెక్రటేరియట్లు పెట్టి అక్కడే పదిమంది విద్యావంతులకు ఉద్యోగాలు ఇస్తామనీ, గ్రామ సమస్యలపై వారే స్పందిస్తారనీ, పెన్షన్లు లేనివారికి పెన్షన్లు, ఇళ్ల లేనివారిని ఇళ్లు వారే వెంటనే కట్టిస్తారని చెప్పారు. నంద్యాలలో డబ్బు పంచారనీ, ప్రజలను బెదిరించి గెలిచారన్నారు. తాను పాదయాత్ర అక్టోబర్ నుంచీ చేపడుతున్నాననీ.. అది పూర్తయ్యేసరికి చంద్రబాబు పాలన అంతమౌతుందని ఆవేశంగా చెప్పారు.
‘వైయస్ కుటుంబం’ అనేది ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమమే కదా! దీన్ని సక్సెస్ చేయడానికి కూడా చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతనే ఆయుధంగా వాడుకోవాలా..? చంద్రబాబుకు దిమ్మదిగిలా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పాలా..? జగన్ మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే… ఇంటింటికీ వెళ్లి వైయస్ హయాంను గుర్తుచేయాలనీ, అప్పుడు జరిగిన మంచిని మననం చేయాలని చెప్పారు. బాగానే ఉంది. కానీ, ఆయన మరణం తరువాత, ఇప్పటివరకూ జగన్ ఏం చేశారు..? ప్రతిపక్ష పార్టీగా ఆయన ఏం సాధించారనేది కూడా ప్రజలు గుర్తు చేయాలని చెప్పాలిగా..! చంద్రబాబు హయాంలో ప్రజలకు ఇళ్లు ఇవ్వలేదనీ, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదనీ, మహిళలకు డ్వాక్వా రుణాలు మాఫీ కాలేదనీ, రైతు రుణాలు తీరలేదనీ, నిరుద్యోగ భృతి కూడా దక్కలేదనీ… ఇలా చాలాచాలా చెప్పారు కదా. ఇన్ని మోసాలూ అన్యాయాలపై జగన్ సాగించిన సమరం ఏంటనే ప్రశ్న కూడా ఉంటుంది కదా!
నంద్యాల ఎన్నికల్లో చేసిన మితిమీరిన విమర్శలే వైకాపాకి వైఫల్యానికి ఒక కారణంగా అందరూ చెబుతున్నారు. ఎల్లప్పుడూ అధికారం గురించి మాట్లాడటం కూడా మైనస్ అవుతోందన్న విమర్శలూ గతంలో వినిపించాయి. అవేవీ జగన్ పట్టించుకోవడం లేదనే అనిపిస్తోంది. అధికారంలోకి రాగానే అన్నీ చేసేస్తామని అంటున్నారు. పాదయాత్ర పూర్తయ్యే నాటికి చంద్రబాబు పాలన అంతం అవుతుందని ఇప్పుడు చెబుతున్నారు. అంటే, అప్పటికి ఎన్నికలు వచ్చేస్తాయని జగన్ ఆశిస్తున్నారా..?