త్వరలో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అన్ని రాజకీయ పార్టీలు హైదరాబాద్ ని తామే అభివృద్ధి చేసామని చెప్పుకొంటున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కు వచ్చిపడింది. తెలంగాణా ఉద్యమాల కారణంగా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయంలో హైదరాబాద్ పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలేవీ జరుగలేదు. కనుక ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకొనేందుకు ఏమీ లేదు. అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి హయంలో ఔటర్ రింగ్‌రోడ్డు, శంషాబాద్ విమాశ్రయం, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, మెట్రోరైలు, జీ.హెచ్.ఎం.సీ. ఏర్పాటు, రాజీవ్ గృహకల్ప, ఆరోగ్యశ్రీ పధకం, 108 అంబులెన్స్ సేవలు ఏర్పాటు వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ అవన్నీ తమ స్వంతమన్నట్లుగా వైకాపా నేత షర్మిల అప్పుడే ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టేశారు. నిజానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన పేరు, ఆయన చేపట్టిన ఈ కార్యక్రమాల గురించి బహిరంగంగా చెప్పుకోలేకపోతోంది. అవన్నీ తనవిగా వైకాపా ప్రచారం చేసుకొంటుంటే అభ్యంతరం చెప్పలేకపోతోంది.
తెరాస పార్టీ నేతలు తాము అధికారంలోకి వచ్చిన తరువాత చాలా అభివృద్ధి చేసామని, ఇంకా చాలా చేయబోతున్నామని ప్రచారం చేసుకొంటున్నారు. తెదేపాకు ఎలాగూ హైటెక్ సిటీ వగైరా నిర్మించి, హైదరాబాద్ ని ప్రపంచపఠంలో ఐటి నగరంగా నిలిపామని చెప్పుకొంటుంది. ఇక బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి ఇస్తున్న నిరంతర విద్యుత్ సరఫరా, తెరాస ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు, రోడ్లు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు, స్వచ్చా భారత్ పధకంలో భాగంగా వివిధ పధకాల అమలుకు నిధులు మంజూరు చేస్తోందని చెప్పుకొనే వెసులుబాటు ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. అందుకే తెరాస ప్రభుత్వం ప్రజలను మాటలతో మభ్యపెడుతూ గాలిలో మేడలు కట్టి చూపిస్తోందని విమర్శలు గుప్పిస్తూ నెట్టుకొస్తోంది.