వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సొంత పార్టీ తరఫున, తన కరిష్మా మీద ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఇప్పుడు తనను వీడిపోకుండా చూసుకోవడానికి బుజ్జగించాల్సి రావడాన్నే చాలా ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు. అయితే ఎటూ పార్టీ అధినేత తాము వీడిపోకుండా ఉండేందుకు బుజ్జగిస్తూ ఉన్నారు కదా అనే పాయింట్‌ను అలుసుగా తీసుకుని.. వైకాపా ఎమ్మెల్యేలు ఆయనను బ్లాక్‌మెయిల్‌చేసి లబ్ధి పొందాలని చూస్తే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు పార్టీలో అదే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు జగన్ బుజ్జగింపు భేటీలు పెడుతూ ఉంటే.. మరోవైపు ఒక ఎమ్మెల్యే మాత్రం.. తాను అడిగిన పదవిని కట్టబెడితే.. పార్టీ మారకుండా ఉంటానంటూ జగన్‌తోనే బేరం పెడుతున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే… ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశంలోకి ఫిరాయిస్తారనే పుకార్లు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఆ వ్యవహారం అనుకున్నంత వేగంగా జరగలేదు. అయితే అనూహ్యంగా ప్రతిపక్షం తరఫున పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న భూమా నాగిరెడ్డి పార్టీ మారిపోయారు. దీంతో కేబినెట్ హోదా తో పాటూ విపరీతమైన అధికారాలు ఉండే పీఏసీ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. దీన్ని అవకాశంగా భావించిన గొట్టిపాటి రవికుమార్ జగన్‌తో ఇప్పుడు బేరం పెడుతున్నారట.
పార్టీ తరఫున తనను పీఏసీ ఛైర్మన్ చేసట్లయితే వైకాపాను వీడకుండా ఉంటానని, లేదా, తన దారి తాను చూసుకుంటానని చెబుతున్నారట.
పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి చెందిన వారికే దక్కుతుంది. హోదా గౌరవం అందులో గల అవకాశాలు అన్నీ పుష్కలంగా ఉంటాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని.. గొట్టిపాటి రవికుమార్ జగన్‌తో బేరం పెడుతున్నట్లు సమాచారం. కేవలం పార్టీని వీడిపోకుండా ఉండడానికి ఇంత పెద్ద బేరానికి ఒప్పుకుంటే గనుక.. ముందుముందు పార్టీని వీడదలచుకున్న వారంతా అంతకంటె పెద్ద లాభాలు చూపిస్తే తప్ప వెళ్లిపోతాం అంటూ కొత్త బ్లాక్‌మెయిలింగ్ లకు తెరతీస్తారని పార్టీ నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితిని జగన్ ఎలా నెగ్గుకు వస్తారో చూడాలి.