ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు కేసీఆర్ ని మేనేజ్ చేసి ఆ కేసులో నుంచి ఎలాగో బయటపడ్డారని కానీ రేవంత్ రెడ్డిని మాత్రం గాలికి వదిలేసారని వైకాపా నేత అంబటి రాంబాబు అరోపించారు. అయితే ఆయన చేసిన ఈ ఆరోపణలో ఏమాత్రం పసలేదని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు బయటపడి ఉండి ఉంటే, రేవంత్ రెడ్డి కూడా బయటపడినట్లే భావించవచ్చును. ఒకవేళ అంబటి రాంబాబు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని ఈ కేసులో పట్టించుకోకపోయుంటే, అప్పుడు రేవంత్ రెడ్డి తప్పకుండా చంద్రబాబు నాయుడుని కూడా ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేసి ఉండేవారని ఖచ్చితంగా చెప్పవచ్చును.
ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి మధ్య ప్రధాని నరేంద్ర మోడి రాజీ చేసారని ఆయన ఆరోపించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి అవినీతి కేసుల్లో మధ్యవర్తిత్వం చేసారని చెప్పడం చాలా అవివేకమే. కేసీఆర్ ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడుని ట్రాప్ చేద్దామని ప్రయత్నించినపుడు, అదృష్టవశాత్తు ఆ ఊభిలో నుంచి బయటపడేందుకు సరయిన సమయంలో టెలీఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేతికి అందిరావడంతో చంద్రబాబు నాయుడు సేఫ్ గా బయటపడగలిగారని చెప్పవచ్చును. ఆయనతోబాటే రేవంత్ రెడ్డి కూడా బయటపడ్డారు. ఆ తరువాత తెలంగాణా తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్) గా ప్రమోషన్ కూడా పొందారు.
ఆయనని గాలికి వదిలేసారని అంబటి రాంబాబు మాటలలో అర్ధం లేదు కానీ పరమార్ధం ఉంది. చంద్రబాబు నాయుడు మూలంగానే రేవంత్ రెడ్డి ఇన్ని కష్టాలు పడవలసి వచ్చిందని, అయినా ఆయనని చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని, పార్టీలో ఆయనకి అన్యాయం జరిగిపోతోందని రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఎగద్రోయడానికే అంబటి రాంబాబు ఆవిధంగా అని ఉండవచ్చును. కానీ అంబటి రాంబాబు రెచ్చగొడితే రెచ్చిపోయేంత తెలివి తక్కువ వారు కాదు రేవంత్ రెడ్డి. అయినా ఓ రాయి విసిరి చూస్తే పోయేదేముంది అని విసిరినట్లున్నారు అంబటి రాంబాబు.