మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరాలనుకొన్నపుడు బొబ్బిలి రాజులుగా అందరికీ చిరపరిచితులయిన బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయిన విజయనగరం జిల్లాకు చెందిన మరి కొందరు వైకాపా నేతలు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో బొత్స వలన తాము చాలా సమస్యలు ఎదుర్కొన్నందునే ఆ పార్టీని వీడి వైకాపాలోకి వస్తే, బొత్స కూడా వైకాపాలోకి వచ్చే మాటయితే తాము పార్టీని వీడవలసి వస్తుందని జగన్మోహన్ రెడ్డి ని హెచ్చరించారు. కానీ బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకోవాలని అప్పటికే నిశ్చయించుకొన్న జగన్మోహన్ రెడ్డి, ఆయన విజయనగరం జిల్లా పార్టీ వ్యవహారాలలో వేలు పెట్టరని, ఆయనకి విశాఖ జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని, వారికి హామీ ఇచ్చి బొత్సను పార్టీలో చేర్చుకొన్నారు.
తమ మాటకి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా తాము వ్యతిరేకించే బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకొన్నందుకు సుజయకృష్ణ రంగారావు, బేబీ నాయిన అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు. బొత్స సత్యనారాయణ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేకపోవడం, బొబ్బిలి రాజులిరువురు పార్టీని పట్టించుకోకపోవడంతో విజయనగరం జిల్లాలో వైకాపా పరిస్థితి అయోమయంగా మారింది. పార్టీ అధిష్టానం వారికీ, బొత్స సత్యనారాయణకి మధ్య రాజీ కుదిర్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి బొత్స సత్యనారాయణ స్వయంగా వారితో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తనకు విధేయుడయిన కోలగట్ల వీరభద్రస్వామిని శుక్రవారం సాయంత్రం బొబ్బిలికి పంపించి, పార్టీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని విభేదాలు పక్కనబెట్టి అందరం కలిసి పనిచేద్దామని సందేశం పంపించారు. కానీ తాము బొత్స సత్యనారాయణతో రాజీకి సిద్దంగా లేమని, ఉంటే పార్టీలో తామయినా ఉండాలి లేకుంటే ఆయన అయినా ఉండాలి తప్ప అందరూ కలిసి ఉండటం సాధ్యం కాదని సుజయకృష్ణ రంగారావు, బేబీ నాయిన తేల్చి చెప్పినట్లు సమాచారం.