వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26 నుండి గుంటూరులో ఏసి కాలేజీ ఎదుట ఉన్న మైదానంలోఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. అందుకోసం ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ తదితరులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అది సర్వసాధారణమయిన విషయమే.
కానీ వారు దాని కోసం భూమి పూజ నిర్వహించడమే చాలా విచిత్రంగా ఉంది. సాధారణంగా ఏదయినా నిర్మాణ కార్యక్రమాలకి మాత్రమే ప్రజలు భూమి పూజలు చేస్తుంటారు. కానీ నాలుగయిదు రోజుల్లో ముగిసిపోబోయే ఆమరణ నిరాహార దీక్ష కోసం ఏర్పాట్లు మొదలు పెట్టేముందు భూమి పూజ చేయడం సరికొత్త ట్రెండ్ అనే చెప్పక తప్పదు. దానికి వైకాపా నేతలు శ్రీకారం చుట్టారు.
క్రీష్టియన్ మతస్తుడయిన జగన్ హిందూ స్వాములను కలవడం, పుష్కర స్నానాలు చేసి పిండ ప్రదానాలు చేయడం, ఇప్పుడు అవసరం లేకపోయినా భూమి పూజలు చేయడం వంటివన్నీ గమనిస్తే బహుశః ఆయన హిందువులకు దగ్గరయ్యేందుకే ఇటువంటి అనవసరమయిన హడావుడి చేస్తున్నరేమో? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు అన్ని మతాల ప్రజలను ఆకట్టుకొనేందుకు రకరకాల వేషాలు వేస్తూ హడావుడి చేస్తుంటారు. కానీ ఏ ఎన్నికలు లేని ఈ సమయంలో వైకాపా నేతలు ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో? ఏమో?