హైదరాబాద్: ఏపీలో టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితమే నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీను కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మరో షాక్ తగిలింది. కడప జిల్లా వైసీపీ నాయకుడు, బద్వేల్ ఎమ్మెల్యే త్రివేది జయరాములు ఇవాళ విజయవాడలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆయన చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరారు. కృష్ణాజిల్లా ఎమ్మెల్యే బొండా ఉమ, అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కూడా అక్కడ ఉన్నారు. బద్వేల్ బాగా వెనకబడిందని, నియోజకవర్గ అభివృద్ధికోసమే తెలుగుదేశంలో చేరానని జయరాములు చెప్పారు. తనకు జగన్తో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. మొన్న టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి తదితరులు మరికొంతమంది కూడా వస్తారని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇవాళ జయరాములు టీడీపీ తీర్థం పుచ్చుకోగా, మరో కొంతమంది క్యూలో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు బద్వేల్ ఎమ్మెల్యే టీడీపీలో చేరిన సమయానికి జగన్ అక్కడ ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అవటం విశేషం. పార్టీలో మిగిలిఉన్న ఎమ్మెల్యేలకు ఆయన నిన్నే హేట్సాఫ్ చెప్పగా, ఇవాళ మళ్ళీ ఒకరు జంప్ కావటం ఆయనకు షాకేనని చెప్పాలి. జయరాములు గతంలో పులివెందుల మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీలో చేరి బద్వేల్ ఎస్సీ నియోజకవర్గంలో పోటీచేసి గెలిచారు.