వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా అభ్యర్ధి నల్లా సూర్యప్రకాష్ తరపున వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రచారం మొదలుపెట్టారు. ఆ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజి వరకు ఉచిత విద్య అందిస్తామని గొప్పలు చెప్పుకొంటారు. కానీ కనీసం స్కాలర్ షిప్పులు కూడా చెల్లించడం లేదు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి అప్పుడు ఓటేస్తే వేసారు. కానీ ఈసారి మళ్ళీ అదే పొరపాటు చేయవద్దని వరంగల్ ప్రజలని కోరుతున్నాను. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఎల్లప్పుడూ పేద ప్రజల సంక్షేమం కోసం తపించేవారు. తెరాసకు తగిన గుణపాఠం చెప్పాలంటే వైకాపా అభ్యర్ధికే ఓటు వేయాలి,” అని అన్నారు.
కేజీ టు పీజి వరకు ఉచిత విద్య అందించే విషయంలో తెలంగాణా ప్రభుత్వం మాట తప్పిందా లేక దాని కోసం ఏర్పాట్లు చేయడానికి సమయం తీసుకొంటోందా? అనే విషయం పక్కనపెడితే, అదే ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిస్తున్న వైకాపాకు ఎందుకు ఓటు వేయాలి? తెరాస ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశ్యంతో తెలంగాణా ప్రజల కోసం ఏనాడు పోరాడని వైకాపాకు ఎందుకు ఓటేయాలి? ఒకవేళ వైకాపా అభ్యర్ధిని గెలిపించినా ఆయనొక్కడివలన ఏమి సాధ్యమవుతుంది? వరంగల్ ప్రజలకు ఆయన ఏమి చేయగలరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వైకాపా ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తునపుడు, ఆ పార్టీ అభ్యర్ధిని గెలిపించి లోక్ సభకు పంపినా ఆయన మాటను కేంద్రం పట్టించుకొంటుందా? అసలు ఆయన జగన్ అనుమతి లేకుండా తెలంగాణా సమస్యల గురించి పార్లమెంటులో మాట్లాడే సాహసం చేయగలరా? అనే సందేహాలు కలుగకమానవు. బహుశః ఈ ప్రశ్నలకు వైకాపా వద్ద కూడా ఎటువంటి సమాధానాలు ఉండకపోవచ్చును.