తెలంగాణాలో గెలిచినా ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలలో ఇద్దరు తెరాసలో చేరిపోయారు. పార్టీ ఫిరాయించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని వైకాపా స్పీకర్ మధుసుధనాచారిని కోరింది కానీ ఏనాడు దాని కోసం గట్టిగా పట్టుబట్టలేదు. తమ పార్టీ ఎమ్మెల్యేలని తెరాసలోకి ఆకర్షించినప్పటికీ 4నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకే వైకాపా మద్దతు ఇచ్చింది. అందుకు జగన్మోహన్ రెడ్డి చాలా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చినా మేము ఏ పార్టీకి మద్దతు ఇస్తే మీకెందుకు? తెదేపా కుట్రలను ఎదుర్కోవడానికే తెరాసకు మద్దతు ఇచ్చాము.” అని చెప్పి తన నిర్ణయాన్ని సమర్ధించుకొన్నారు. కానీ వైకాపా నుండి తెరాసలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలను ఉపేక్షించినట్లే వైకాపా నుండి తెదేపాలోకి వెళ్ళిన ఎంపి యస్.పి.వై. రెడ్డిని ఉపేక్షించదలుచుకోక పోవడం విశేషం. కారణం తెదేపాతో ఉన్న శత్రుత్వమే.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం క్రింద యస్.పి.వై. రెడ్డిపై అనర్హత వేటు వేసి, ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని వైకాపా కోరుతోంది. వైకాపా ఇచ్చిన పిర్యాదు మేరకు లోక్ సభ సభాపతి సుమిత్రా మహాజన్ పార్లమెంటు నైతిక విలువల కమిటీ శుక్రవారం డిల్లీలో సమావేశమయ్యింది. ఆ సమావేశానికి హాజరయిన వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంతవరకు యస్.పి.వై. రెడ్డికి షో-కాజ్-నోటీస్ ఇవ్వలేదని చెప్పడంతో కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు.
యస్.పి.వై. రెడ్డిపై చర్యలు తీసుకోమని కోరుతున్నప్పుడు, ఆయన పార్టీ మారిన వెంటనే షో-కాజ్-నోటీస్ ఇచ్చి సరయిన సమాధానం రానట్లయితే ఇటువంటి తదుపరి చర్యలకు ఉపక్రమించవలసి ఉంటుంది. కానీ అసలు ఇంత వరకు ఆయనకీ నోటీసు ఇవ్వకుండా ఆయనపై చర్యలు తీసుకోమని లోక్ సభ స్పీకర్ ని కోరడం హాస్యాస్పదం. ఆయన తను పార్టీ మారుతున్నట్లు మీడియా ముందు చేసిన ప్రకటనల ఆధారంగా కమిటీ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు మేకపాటి వంటి రాజకీయ అనుభవజ్ఞుడు చెప్పడం మరో విచిత్రం.