జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం విజయవాడలో వైకాపా విస్తృత స్థాయి సమావేశం జరుగబోతోంది. బందరు రోడ్డులోని ఏ-1 కన్వెన్షన్ హాల్ లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం సాగుతుంది. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గల నేతలు, ప్రజా ప్రతినిధులు, నియోజక వర్గ ఇన్-చార్జ్ లు అందరూ దీనికి హాజరవుతారని వైకాపా తెలిపింది.
ముద్రగడ పద్మనాభం దీక్ష కారణంగా వైకాపా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు తాత్కాలికంగా అడ్డుకట్టవేసి, ప్రభుత్వంపై ఒత్తిడి ఏర్పరచగలిగినప్పటికీ, వైకాపా మనుగడకి ప్రాణాధారమైన సాక్షి న్యూస్ ఛానల్ ప్రసారాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో వైకాపాలో కూడా అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లయింది. బహుశః అందుకే రేపు అత్యవసరంగ ఈ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుచేసుకొని ఉండవచ్చు.
సాక్షి అండలేని వైకాపాని ఊహించుకోవడం కష్టం. దాని మనుగడకి అది చేసే పోరాటాలు ఎంత ముఖ్యమైనవో, వాటిని ప్రజలకు చేర్చే సాక్షి ఛానల్ కూడా అంతే ముఖ్యం. కానీ సాక్షి ఛానల్ ప్రసారాలు మళ్ళీ ఎప్పటి నుంచి మొదలవుతాయో తెలియదు. ప్రభుత్వంపై ఒత్తిడి లేకపోతే ఇప్పుడు రెండు మూడు జిల్లాలకే పరిమితమైన ఆ నిషేధం మున్ముందు అన్ని జిల్లాలకి కూడా వర్తింపజేసే ప్రమాదం ఉంది. కనుక సాక్షి న్యూస్ ఛానల్ ప్రసారాల పునరుద్ధరణ కోసం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రేపటి సమావేశంలో తగిన కార్యాచరణ రూపొందించుకోవచ్చు.
కానీ ఆ పని చేయకుండా, జగన్మోహన్ రెడ్డి, వైకాపా నేతలు యధాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలతో కాలక్షేపం చేసినట్లయితే అవి యధాతధంగా ప్రజలకు చేరే అవకాశం ఉండదు కనుక వారికి గొంతు నొప్పే మిగులుతుంది. వ్యవప్రయాసలకోర్చి నిర్వహిస్తున్న ఆ సమావేశ ప్రయోజనం కూడా నెరవేరదు.
ముద్రగడ పద్మనాభం దీక్ష కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ పరిస్థితులపై కూడా రేపటి సమావేశంలో వైకాపా చర్చించడం తధ్యం కనుక ఏవిధంగా వ్యవహరిస్తే పార్టీకి రాజకీయ ప్రయోజనం కలుగుతుంది? ప్రభుత్వంపై ఇంకా ఒత్తిడి పెరుగుతుంది? అనే దానిపై కూడా రేపటి సమావేశంలో చర్చించవచ్చు.