కడప జిల్లా నుండి వైకాపాకి చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీని వీడబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఆ వార్తలు నిజమేనని ఆయన స్వయంగా నిన్న దృవీకరించారు. ఆయన వైకాపా జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి. జమ్మలమడుగులో నిన్న జరిగిన ముద్రా యోజన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్టోబర్ 22వ తేదీ లోగా పార్టీకి, తన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.
“నా రాజీనామాపై మీడియాలో ఇప్పటికే చాలా వార్తలు వచ్చేయి. కానీ అవేవీ సమగ్రమయినవి కావు. ఈ విషయం గురించి వ్రాయవలసింది ఇంకా చాలా ఉంది. పార్టీ వీడిన తరువాత అన్ని విషయాల గురించి మాట్లాడుతాను. పార్టీ మారేటప్పుడు ఎమ్మెల్యే పదవిని వెంటబెట్టుకు వెళ్ళడం నాకిష్టం లేదు. అలాగా వెళితే ప్రజలలో నాకున్న గౌరవం కోల్పోతాను. అందుకే దానికి కూడా రాజీనామా చేసే పార్టీ మారుతాను. ఏ పార్టీలో చేరబోయేది అప్పుడే చెపుతాను,” అని తెలిపారు.
ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా మెలిగిన ఆదినారాయణ రెడ్డి, ఆ తరువాత జగన్ వెంట నడిచారు. కానీ ఆ తండ్రీ కొడుకుల వ్యవహార శైలిలో చాలా వ్యత్యాసం ఉండటంతో ఆయన క్రమేపీ పార్టీకి దూరం కాసాగారు. పార్టీలో అందరికంటే సీనియర్ అయిన ఆదినారాయణ రెడ్డిని జగన్ ఎన్నడూ పట్టించుకోకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది.