ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా క్రమంగా తన స్వశక్తి మీద నిలబడగలిగే పరిస్థితికి రాగలిగినా తెలంగాణాలో మాత్రం ఇంకా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొన్నట్లుగా తన మనుగడ కోసం ఎప్పుడో చనిపోయిన రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకోక తప్పడం లేదు. మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజా సమస్యలపై తెరాస ప్రభుత్వంతో పోరాడలేని వారి బలహీనతే అందుకు ప్రధాన కారణం. అదే ఆంధ్రప్రదేశ్ లో జగన్ నిత్యం చేస్తున్న పోరాటాల కారణంగా జగన్ తో సహా ఆ పార్టీ నేతలు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నామ స్మరణ చేయవలసిన అవసరం బాగా తగ్గింది. ఇప్పుడు వాళ్ళు కేవలం ప్రజా సమస్యలు, వాటిపై ప్రభుత్వ వైఖరి గురించే ఎక్కువగా మాట్లాడుతుండటం అందరూ గమనించవచ్చును. కానీ తెలంగాణాలో ఆ పరిస్థితి లేదు కనుక రాజశేఖర్ రెడ్డి నామ స్మరణ తప్పడం లేదు. హన్మకొండలో నిన్న జరిగిన పార్టీ సమావేశంలో వైకాపా నేతలు మాట్లాడిన మాటలు వింటే ఆ సంగతి అర్ధం అవుతుంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “రాజశేఖరరెడ్డి లేని పాలనను ప్రజలు గమనిస్తున్నారు. కనుక కార్యకర్తలు అందరూ ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ పథకాలను ప్రచారం చేయూలి. మరే ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ పధకాలను స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అమలుచేసారు. కాని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేవలం బంగారు తెలంగాణ పేరుతో హామీలు గుప్పిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. మన అందరికీ నచ్చిన అభ్యర్ధి పేరును జగన్ స్వయంగా ప్రకటిస్తారు. ఆ వ్యక్తి 4వ తేదీన నామినేషన్ వేస్తారు. వైకాపా నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి మన అభ్యర్ధి విజయానికి కృషి చేయాలి,” అని కోరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి సమావేశానికి హాజరయిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల వలన జిల్లాలో అనేకమంది జీవితాలలో వెలుగులు నిండాయి. షర్మిల తెలంగాణాలో పరామర్శ యాత్రలు చేసినప్పుడు అందరూ ఆమెను స్వంత ఆడబిడ్డగా భావించి ఆదరించారు. వారందరూ ఈ ఎన్నికలలో మన పార్టీ అభ్యర్ధికే ఓటువేసి ఆయన రుణం తీర్చుకొంటారని నమ్ముతున్నాను,” అని అన్నారు.
జిల్లా వైకాపా అధ్యక్షుడు జె. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ “వరంగల్ జిల్లాలో మన పార్టీ అంటే తెరాస, కాంగ్రెస్, టీడీపీలకు భయం ఏర్పడినట్లుంది. ఈ ఎన్నికలో మనం తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పడానికి అదే నిదర్శనం. మనం అందరం కలిసి మన పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి,” అని అన్నారు.