ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తెరాస నేతలతో జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపి తెదేపా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నారని తెదేపా నేతలు, మంత్రులు తీవ్ర ఆరోపణలు చేసారు. అంతకు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధికి వైకాపా మద్దతు ఇచ్చినందున వారి ఆరోపణలు నిజమని ప్రజలు కూడా విశ్వసించారు. దాని వలన జగన్మోహన్ రెడ్డి నిత్యం గొప్పగా చెప్పుకొనే విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది. బహుశః అందుకే వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి జరిగే ఉప ఎన్నికలలో వైకాపా ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారని భావించవచ్చును.
అయితే తెలంగాణాలో అసలు ఉనికే చాటుకోలేకపోతున్న వైకాపా, హేమాహేమీలు తలపడుతున్న ఈ వరంగల్ ఉప ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తున్నట్లు? అనే సందేహం కలుగవచ్చును. తెరాసకు నేరుగా మద్దతు ఈయకపోయినా ఈ ఉప ఎన్నికలలో పోటీ చేసి తెదేపా, బీజేపీలకు పడే ఓట్లను చీల్చి తెరాసకు సహాయపడగలదు. ఆవిధంగా తెరాసకు పరోక్షంగా సహాయపడుతూనే, తెరాసకు తనకు ఎటువంటి రహస్య అనుబంధం లేదని చెప్పుకోవచ్చును.
వైకాపా ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో దానినే నమ్ముకొన్న నేతలు పావులుగా మిగిలిపోవచ్చును. కనుక రాజకీయాల పట్ల ఏదో మోజు కొద్ది వైకాపాలో చేరినవారికి పరువాలేదు కానీ రాజకీయంగా పైకి ఎదగాలని కలలు కనేవారికి బహుశః తెలంగాణా వైకాపా సరయిన రాజకీయ వేదిక కాదనే చెప్పవచ్చును. ఒకవేళ సరయినదేనని భావిస్తే వారి రాజకీయ జీవితం, భవిష్యత్ రెండింటినీ పణంగా పెడుతున్నట్లే భావించవచ్చును.