ప్రత్యేక హోదా కోరుతూ జగన్ చేసిన నిరాహార దీక్ష ఎటువంటి ఫలితం లేకుండానే ముగియడంతో వైకాపా నేతలు అయోమయంలో పడ్డారు. ఎందుకంటే జగన్ చేత దీక్షను విరమింపజేసేందుకు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ఏదో ఒక హామీ ఇస్తుందని ఆశించిన వైకాపా నేతలకు వాటి స్పందన చూసి షాక్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, తెదేపా నేతలు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలతో ఎదురుదాడి చేయగా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జగన్ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారన్నట్లు మాట్లాడారు.
ప్రత్యేక హోదాపై గ్రామస్థాయి నుండి పోరాటం మొదలుపెట్టి, పరిస్థితులను, ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు అంచనా వేసుకొంటూ వాటిని బట్టి తమ పోరాటం ఉదృతం చేయడమో వెనక్కి తగ్గడమో చేసి ఉండి ఉంటే ఇటువంటి దుస్థితి ఎదురయ్యేది కాదు. కానీ జగన్ తొందరపాటు వలననో లేక ఆయనకి పార్టీలో సరయిన సలహా ఇచ్చేవాళ్ళు లేకనో, ఆయన ఎవరి సలహాలు సూచనలు తీసుకోకపోవడం చేతనో అకస్మాత్తుగా నిరాహార దీక్షకు కూర్చొని భంగపడ్డారు. ఇంతవరకు వచ్చిన తరువాత ఇప్పుడు వెనక్కి తగ్గాలంటే అందుకు చాలా బలమయిన కారణం కావాలి లేకుంటే నవ్వుల పాలవుతారు. అందుకే వైకాపా తన పోరాటాన్ని మళ్ళీ మొదటి నుండి కొనసాగించవలసి వస్తోంది.
అందులో భాగంగానే ఇవ్వాళ్ళ విజయవాడలోని పి.డబ్ల్యూ.డి. గ్రౌండ్స్ నుండి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వరకు వైకాపా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ర్యాలీ కార్యక్రమం పెట్టుకొన్నారు. కానీ దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వేలమంది ర్యాలీగా వెళ్లేందుకు ఏ రాష్ట్రంలోను పోలీసులు అనుమతించరనే సంగతి వైకాపా నేతలకి తెలియదనుకోలేము. అయినా వాళ్ళు భారీ ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొని వ్యానుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. సహజంగానే వైకాపా నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా ర్యాలీ నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. బహుశః తెదేపా నేతలు కూడా అందుకు ధీటుగానే జవాబు చెప్పవచ్చును. అయితే వైకాపా మొదలుపెట్టిన ఈ పోరాటం చివరికి ఏమలుపు తిరుగబోతోంది? ఏవిధంగా ముగుస్తుంది? అసలు ప్రత్యేక హోదా సాధించగలదా లేదా? అనే ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి.