వైఎస్ కుటుంబంలో విభేదాలు రోజు రోజుకు పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైఎస్ జయంతి నాడు ఉదయం షర్మిల.. సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ఒకరికొకరు ఎదురు పడకుండా ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. ఈ సారి వర్థంతికి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. సిమ్లా టూర్లో ఉన్న జగన్ తిరిగి వచ్చిన తర్వాత కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. రెండో తేదీన వైఎస్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అదే రోజున హైదరాబాద్ వైఎస్ విజయలక్ష్మి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌తో కలిసి పని చేసిన వారందరికీ ఆహ్వానాలు పంపారు. కేబినెట్ మంత్రులు… వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన నేతలందరికీ ఆహ్వానాలు వెళ్లాయి.
ఉదయం ఇడుపులపాయలో వైఎస్ విజయమ్మ నివాళులు అర్పించి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డితో కలిసి నివాళులు అర్పిస్తారా లేక షర్మిలతో కలిశా అన్నదానిపై స్పష్టత లేదు. ఇటీవల తాడేపల్లి వచ్చిన విజయలక్ష్మి జగన్మోహన్ రె్డ్డి ఇంట్లో మూడు రోజులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతనే ఆమె వైఎస్ వర్థంతి రోజున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈ సమావేశం రహస్యంగా ఏమీ జరగడం లేదు. హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ కన్వెన్షన్హాల్లోనే నిర్వహిస్తున్నారు.
వైఎస్ పన్నెండో వర్థంతి సందర్భంగా నిర్వహిస్తున్నామని విజయలక్ష్మి చెబుతున్నారు కానీ.. అటు షర్మిల కానీ ఇటు జగన్ ప్రమేయం కానీ లేకుండా ఇలాంటి సభలు .. సమావేశాలు విజయలక్ష్మి నిర్వహించరన్న అంచనా కూడా ఉంది. ఎవరి ప్రోద్భలంతో.. ఏ ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారో క్లారిటీ లేదు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంతా ఏకమయ్యే ప్రయత్నాలు మాత్రం ఎప్పటికప్పుడు విఫలమవుతున్నాయన్న అభిప్రాయం మాత్రం కొంత మందిలో వినిపిస్తోంది.