హైకోర్టు న్యాయమూర్తులకు చంద్రబాబు హయాంలో అమరావతిలో ఇళ్ల స్థలాలిచ్చారని అందుకే ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయని తాజాగా వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆరోపణలు ప్రారంభించింది. మంత్రులు కూడా అదే తరహాలో న్యాయవ్యవస్థపై నిందలేస్తున్నారు. అయితే చంద్రబాబు న్యాయమూర్తులకు ఉచితంగా ఇళ్ల స్థలాలివ్వలేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు న్యాయమూర్తులకు, ఎన్జీఓలకు, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించింది. అందరూ డబ్బు చెల్లించాల్సిందే. చంద్రబాబు ప్రభుత్వం కూడా అమరావతిలో స్థలాలు పొందిన న్యాయమూర్తులు 25 లక్షల రూపాయల వంతున ప్రభుత్వానికి చెల్లించారు. ఐఎఎస్, ఐపీఎస్లు కూడా చెల్లించారు.
ఇప్పుడు వారు కట్టిన సొమ్ములు ప్రభుత్వం వద్దనే ఉన్నాయి. జర్నలిస్టులు కూడా ప్రభుత్వానికి డబ్బు కట్టారు. అవి కూడా అంతే… ఎవరి ఇంటి స్వప్నం నెరవేరలేదు. నిజానికి ఇలా న్యాయమూర్తులలతో పాటు ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు జర్నలిస్టులు ఇళ్ల స్థలాలివ్వడం చంద్రబాబుతో ప్రారంభం కాలేదు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ నడిబొడ్డున ఉండే ప్రశాసన్ నగర్ పూర్తిగా ప్రభుత్వం అఖిలభారత సర్వీసు అధికారులకు ఇచ్చిన స్థలాలు. ఆ పక్కనే జర్నలిస్టు కాలనీ కూడా ఉంటుంది. దశాబ్దాలుగా ప్రభుత్వం వద్ద స్థలాలు తీసుకున్న న్యాయమూర్తులుచాలా మంది ఉన్నారు.
అంత ఎందుకు.. ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు న్యాయమూర్తులకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జీవో జారీచేశారు. కానీ మిగతా ముఖ్యమంత్రులు నిజాయితీగా ఇచ్చారు కానీ..వైఎస్ మాత్రం వివాదాస్పద భూమిని ఇచ్చారు. దాంతో ఆ భూమిలో స్థలాలు తమకు వద్దని న్యాయమూర్తులు అప్పుడే చెప్పేశారు. ఇప్పటికీ ఆ భూమికి డబ్బులు కట్టి జర్నలిస్టులు.. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
అయినా.. చంద్రబాబు ప్రభుత్వం న్యాయమూర్తులకు ఉచితంగా ఇళ్లస్థలాలు ఇచ్చిందని మంత్రులు సైతం ప్రచారం చేసేసి న్యాయవ్యవస్థపై బురద పూసేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పనిచేసిన, పనిచేస్తోన్న న్యాయమూర్తులకు కూడా నోయిడా వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించింది. న్యాయవ్యవస్థపై దాడి చేయాలనుకున్న వైసీపీ నేతలకు ఇవేమీ పట్టడం లేదు. తమ దారిలో తాము వెళ్తున్నారు.