ఏపీ సర్కార్ వింత వింత నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజల అభిప్రాయాలతో పని లేకుండా.. తాము చెప్పిందే పని.. చేసిందే వేదం అన్నట్లుగా చేసుకు పోతూ ఉంది. తాజాగా విజయవాడను ఆనుకుని ఇండే తాడిగడపను… ప్రత్యేక మున్సిపాల్టీగా చేసేసింది. చుట్టుపక్కల గ్రామాలను కలిపేసి.. మున్సిపాల్టీ చేసేసింది. ఇప్పటి వరకూ వారంతా తాము విజయవాడలో భాగమని అనుకుంటున్నారు. గ్రేటర్ విజయవాడలో మార్చేసి… తమను కలిపేస్తారని గట్టిగా నమ్ముతూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తాటిగడప అనే మున్సిపాల్టీని ఏర్పాటుచేసేసింది. అదే వివాదం అనుకుంటే.. ప్రభుత్వ పథకాలకు పెట్టినట్లుగా… ఊరికి కూడా వైఎస్ఆర్ పేరు పెట్టేసింది. వైఎస్ఆర్ తాటిగడప అనే పేరుతో మున్సిపాల్టీని ఏర్పాటు చేసింది. దీంతో అక్కడి ప్రజలు అవాక్కవ్వాల్సి వచ్చింది. వైఎస్ఆర్కి తాటిగడపకు ఏంటి సంబందం అని చర్చించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.
విజయవాడ నగర శివారు ప్రాంతంలో రాజకీయంగా కాస్త క్లిష్ట పరిస్తితులు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే వర్గాలు ఎక్కువగా నివసిస్తూ ఉంటాయని ప్రభుత్వ పెద్దలు భావించారు. వారికి చెక్ పెట్టాలంటే.. ప్రత్యేక మున్సిపాల్టీ ఉండాల్సిందేనని.. అదీకూడా వైఎస్ఆర్ పేరుతో పెట్టాల్సిందేనని నిర్ణయించుకునే ఈ మేరకు అమలు చేసేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరు కూడా అక్కడి ప్రజలు నోరెత్తలేరు. ఎత్తితే కేసులు పేరుతో తీసుకెళ్లి లాకప్‌లో వేస్తారు. అందుకే… ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి నవ్వుకోవడంతోనే సరి పెడుతున్నారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని పాదయాత్రలో జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రయత్మే చేయలేదు కానీ.. కృష్ణా జిల్లాలోని ఓ మున్సిపాల్టీ ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ పేరు మాత్రం పెట్టేసుకున్నారు. త్వరలో కృష్ణా జిల్లా పేరు మారిస్తే.. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ మున్సిపాల్టీ ఉన్నట్లవుతుంది. నిజానికి ఊళ్ల పేర్లకు చారిత్రక నేపధ్యాలుంటాయి. వాటితో ప్రజలకు సెంటిమెంట్లు ఉంటాయి. ఇలా మార్పు చేయడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రభావం ఉంది. రాజకీయ నేతల ఇమేజ్ .. ఆయా పార్టీలు ప్రచారం చేసుకున్నంత కాలమే ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ మూల పురుషుడ్ని… బతక నేర్చిన నేతలు మోస్తారు. తర్వాత పట్టించుకోరు. అది ఆ నేతకు అనమానాలు మిగులుస్తుందని అంటున్నారు.