అమరావతి చంద్రబాబు ఆలోచనలకు ప్రతిరూపం అని అనుకుంటున్నారు కానీ.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే.. గుంటూరు, విజయవాడ సిటీలను కలుపుతూ.. మధ్యలో ఓ మెగా నగరాన్ని నిర్మించి.. హైదరాబాద్‌ను మించిన మహానగరాన్ని తీర్చిదిద్దాలని ప్రణాళికలు వేశారు. 2007లో విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ” టువార్డ్స్ ప్లాన్డ్ డెలవప్మెంట్ – 2021″ పేరుతో వీజీటీఎం – ఉడా రూపొందించిన ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. అప్పట్లో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి కలిపి వీజీటీఎం -ఉడాగా ఉండేది. చంద్రబాబు రాజధానిని అమరావతిలో పెట్టాలనుకున్న తర్వాత దీన్ని రద్దు చేసి..సీఆర్డీఏను తీసుకొచ్చారు.
2006లోనే గుంటూరు-విజయవాడ మధ్య “మెగా సిటీ” ప్లాన్ చేసిన వైఎస్..!
వీజీటీఎం-ఉడాను.. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆషామాషీగా తీసుకోలేదు. విజయవాడ – గుంటూరులను కలుపుతూ.. మహానగరాన్ని నిర్మించవచ్చని భావించారు. 2006-08 మధ్యలో అంతర్జాతీయ కన్సల్టెన్సీలను అధ్యయనానికి నియమించారు. వారికి రూ. కోట్లు ఫీజుల రూపంలో చెల్లించారు. ఆ కన్సల్టెన్సీలు 2021 కల్లా గుంటూరు- విజయవాడ మధ్యలో.. ఓ కొత్త నగరాన్ని నిర్మించి.. మొత్తంగా మహానగరాన్ని ఎలా చేయవచ్చో.. ఓ మాస్టర్ ప్లాన్‌ను కూడా ఇచ్చారు. ఇందులో ప్రస్తుతం రాజధాని కేంద్రంగా ఉన్న మందడం గ్రామంతో పాటు.. వంద శాతం మాగాణి భూములు ఉన్న కొల్లిపర మండలం మొత్తం కలిసి ఉంది. 23వ నెంబర్ జాతీయ రహదారి చుట్టూ.. టౌన్ షిప్‌లు నిర్మించడంతో పాటు.. వివిధ రకాల అభివృద్ధి ప్రణాళికలు అందులో ఉన్నాయి. ఈ మాస్టర్ ప్లాన్ మొత్తం రికార్డెడ్. ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రజాధనం ఖర్చు పెట్టి.. చేయించుకున్న మాస్టర్ ప్లాన్ అది. వైఎస్ చనిపోవడం.. తర్వాత పరిస్థితులు మారిపోవడంతో దాన్ని రోశయ్య, కిరణ్ పట్టించుకోలేదు.
వైఎస్ మరణంతో పెండింగ్‌లో ప్రతిపాదనలు..!
తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు.. ఆ మాస్టర్ ప్లాన్ గురించి తెలిసి ఉంటుంది. వాటిని ఆధారంగా చేసుకున్నారో.. లేకపోతే.. గుంటూరు – విజయవాడ మధ్యలో రాజధాని నిర్మిస్తూ.. అటూ.. ఇటూ నగరాలు కలిసిపోయి.. హైదరాబాద్ ను మించిన రాజధాని అవుతుందని సొంతంగా అంచనా వేసుకున్నారో కానీ.. అమరావతి పేరుతో.. రాజధానికి రూపకల్పన చేశారు. ఆయన సంకల్పానికి రైతులు కూడా సహకరించారు. ప్రభుత్వాలను నమ్మి.. ఎకరా భూమి ఇవ్వడానికి కూడా ముందుకు రాని పరిస్థితుల్లో… కచ్చితంగా అభివృద్ధి చెందుతామని.. భావించి.. వేల ఎకరాలు ఇచ్చేశారు రైతులు. దాంతో అమరావతి పట్టాలెక్కింది.
వైఎస్ ఆశయాన్ని పరిగణనలోకి తీసుకోని కుమారుడు జగన్..!
ఇప్పుడు.. వైఎస్ కుమారుడు.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. భిన్నంగా ఆలోచించారు. తండ్రి పదేళ్ల కిందటే ఆలోచించిన మహానగరం పునాదుల మీద ఉన్నా.. ఆయన వాటిని ధ్వంసం చేస్తున్నారు. తండ్రి గతంలో సిద్ధం చేయించిన మాస్టర్ ప్లాన్ గురించి.. అప్పటి అధికారులు కచ్చితంగా జగన్ దృష్టికి తీసుకెళ్లే ఉంటారు. ఎందుకంటే… వైఎస్ హయాంలో చక్రం తిప్పిన వారే.. ఇప్పుడు.. కూడా.. కీలకంగా ఉన్నారు. కానీ జగన్ మాత్రం…అక్కడ ఓ సిటీ అభివృద్ధి చెందితే… ఓ సామాజికవర్గం వారు బాగుపడతారన్న ఉద్దేశంలో ఉన్నట్లుగా ఉన్నారు. అందుకే.. తండ్రి ఆశయాన్ని కూడా లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.