ఎవరైనా ఓవరాక్షన్ చేస్తున్నా, అతి చేష్టలు చేస్తున్నా ‘వీడు బాగా ముదురు’ అంటుంటారు. ఇప్పుడు ఏపీలో అధికార వైకాపా ఇలాగే ముదిరిపోయింది. ‘ప్లీజ్…ఒక్క ఛాన్సివ్వండి’ అంటూ బతిమాలి గెలిచి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రజల కోసం ఎంత పాటుపడుతున్నదనే సంగతి పక్కన పెడితే ముదురు పనులు చేస్తూ అప్రతిష్ట పాలవుతోందని చెప్పవచ్చు. కనబడ్డ ప్రతి నిర్మాణానికి, నేతల విగ్రహాలకు పార్టీ రంగులేస్తూ ‘రంగు రాజకీయం’ చేసిన వైకాపా ప్రభుత్వం చివరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ప్రతిష్టించింది. ఇది రాజకీయమా? పనికిమాలిన చేష్టా? ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేయడంతో వైకాపా సంతృప్తి చెందలేదు.
పంచాయతీ కార్యాలయాలు మొదలుకొని గాంధీ విగ్రహాల వరకు వైకాపా పార్టీ రంగులు (నీలం, ఆకుపచ్చ, తెలుపు) వేశారు. ఈ భవనాలన్నీ వైకాపా సొంతమా? వైకాపాకు జనం అధికారం ఇచ్చింది పరిపాలన చేయండనిగాని, రంగుల రాజకీయం చేయాలని కాదు కదా. వైకాపా వారు పంచాయతీ కార్యాలయ భవనాలు, శ్మశానాల ప్రవేశ ఆర్చీలు, మంచినీటి ఓవర్హెడ్ ట్యాంకులు, ప్లాస్టిక్ క్యాన్లు, ఆలయాలకు పార్టీ రంగులు వేశారు. ఇతంటితో వదల్లేదు. బర్రెల కొమ్ములకు కూడా పార్టీ రంగులు వేశారు. ఈ పాడు పనికి ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారో, పార్టీ డబ్బు ఖర్చు చేశారో తెలియదు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ మీద, వైఎస్ఆర్, జగన్ మీద ప్రేమతో ఇలా రంగులు వేశారని, ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయలేదని నాయకులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ అనేక పథకాలు ప్రవేశపెట్టి జనాలకు మేలు చేస్తున్నందుకు వారు కృతజ్ఞతగా, సంతోషంతో రంగలు వేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పాడు. మరి చంద్రబాబు హయాంలో అన్న క్యాంటీన్లకు పసుపు పచ్చ రంగు వేయలేదా? అని ప్రశ్నించాడు. వాళ్లు చేసింది ఒప్పు..మేం చేసింది తప్పా అన్నట్లుగా ఉంది ఈయన ధోరణి. రాజకీయ నాయకులు ఎప్పుడూ ఇంతే. వాళ్లు చేశారుగా తామెందుకు చేయకూడదని ప్రశ్నిస్తారు. గత పాలకులు తప్పులు చేస్తే వీరు చేయాలని రూలేమైనా ఉందేమో తెలియదు. జాతీయ పతాకానికి కూడా వైకాపా రంగులు వేసిన ‘మహానుభావులు’ వీళ్లు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం రోడ్ల మీద తెల్లటి గీతలు పెయింట్ చేయంచడం తెలిసిందే. డివైడర్లకు తెలుపు, నలుపు రంగులు రంగులు వేస్తారు. వైకాపా నాయకులు వాటి రంగులు మార్చేసి వైకాపా రంగులు వేశారట…!
ఇక ఏపీలో వైఎస్ఆర్ విగ్రహాలకు కొదువ లేదు. ఎక్కడబడితే అక్కడ ఉన్నాయి. అయినప్పటికీ వైకాపా సర్కారు ప్రతిష్టాత్మక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఇప్పుడు ఇదో పెద్ద వివాదమైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు యూనివర్శిటీలను అనేక రకాలుగా వాడుకుంటున్నాయి. చివరకు అక్కడ రాజకీయ నాయకుల విగ్రహాలు కూడా నెలకొల్పి మరింత కలుషితం చేస్తున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయం వైఎస్ఆర్ పాలనలో ఏర్పాటైందా? కాలేదు. ఆయన అక్కడ చదువుకున్నాడా? లేదు. జగన్ ఆ విశ్వవిద్యాలయం విద్యార్థా? కాదు. మరెందుకు అక్కడ వైఎస్ఆర్ విగ్రహం.
రపు మరో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకుడి విగ్రహం పెట్టరని గ్యారంటీ ఏమిటి? నాగార్జున విశ్వవిద్యాలయం 1976లో ఏర్పాటైంది. వైఎస్ఆర్ 1978లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈయన రాజకీయ నాయకుడు కావడానికి ముందే విశ్వవిద్యాలయం ఉంది.మరి ఆయనకు దీంతో ఏం సంబంధం ఉంది? ఆయన ఇక్కడ చదవుకోలేదు కదా. ఆయన వైద్యవిద్య అభ్యసించింది కర్నాటకలో. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి సంక్షేమ పథకానికి వైఎస్ఆర్ పేరు పెట్టాడు. అయినా ఆయన దాహం తీరడంలేదు.